మూగ వేదన..
వన్యప్రాణులకు వేసవి గండం
వేసవిలో మనుషులే కాదు.. ఇతర జీవులూ ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి కావడం పరిపాటి. సమయానికి తాగునీరు దొరక్కపోతే అవస్థలు పడక తప్పదు. నిత్యం జనారణ్యంలో సంచరించే జంతువులు, పక్షులకు నీటి కొరత ఉండకపోవచ్చు గానీ.. వన్యప్రాణుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఇప్పటికే ఎండల తీవ్రతతో వాగులు, వంకలు, చెలమలు వట్టిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు నీటి జాడ కోసం అల్లాడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు సాసర్ పిట్లలో నీటిని నింపకపోవడంతో మూగరోదనతో అలమటిస్తున్నాయి. ‘సాక్షి’ బృందం పలు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాసర్ పిట్లను పరిశీలించగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి.
– సాక్షి, సిద్దిపేట
కోహెడ మండలంలోని శనిగరంలో ఎండిపోయిన చెలమ
జిల్లాలోని 20 మండలాల్లో 23,336 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. వీటిలో దుప్పులు, నెమళ్లు, మౌస్‌డీర్‌లు, జింకలు, అడవి పందులు ఇతరత్రా జంతువులు పెరుగుతున్నాయి. గతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు 126 సాసర్ పిట్స్, చెల మలను అందుబాటులోకి తీసుకవచ్చారు. వాటిలో నీటిని నింపితే అటవీ జంతువులు దాహంతో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నీటిని తాగి ఉపశమనం పొందేవి. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచే నీటిని నింపేవారు. నెలలో నాలుగు నుంచి ఐదు సార్లు నీటిని నింపాలి. అయితే ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభమై ఎండలు ముదురుతున్నా ఇప్పటి వరకు నీటిని నింపేందుకు అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చెలమలు ఎండల తీవ్రతకు నీళ్లు పలు చోట్ల అడుగంటిపాయాయి. సిద్దిపేట అర్బన్ పార్క్‌లో నీటి ట్యాంకర్, ట్రాక్టర్ ఉన్న సైతం దానితో సాసర్ పిట్‌లలో నీళ్లు పోయడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
నిధులు లేవని..
నిధులు లేవని సాసర్ పిట్లలో నీటిని పోసేందుకు చర్యలు చేపట్టడంలేదు. సోలార్ పంప్‌సెట్లు ఉన్నా వాటిని అటవీ అధికారులు పలు చోట్ల వినియోగంలోకి తీసుకురావడం లేదు. దీంతో అడవి జంతువులు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. తాగు నీటి కోసం అటవీ శాఖ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సాసర్ పిట్లలో నీటిని పోయాలని వన్యప్రేమికులు కోరుతున్నారు.
దాహార్తితో విలవిల
జిల్లాలో 23వేల హెక్టార్లలో అడవి
వట్టిపోయిన చెలమలు
నీరులేక చెత్తాచెదారంతో దర్శనమిస్తున్న సాసర్‌పిట్లు
దృష్టి సారించని అధికారులు
సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ శివారులో 90 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఇందులో కొండ గొర్రెలు, జింకలు, అడవి పందులు, నెమళ్లు జీవనం కొనసాగిస్తున్నాయి. వీటి దాహార్తిని తీర్చేందుకు రెండు సాసర్ పిట్‌లను ఏర్పాటు చేశారు. అందులో ఒక దానిలో పూర్తిగా నీళ్లు లేవు, మరో దానిలో కొన్ని నీళ్లు మాత్రమే కన్పించాయి.
పక్క ఫొటోలో కనిపిస్తున్నది సిద్దిపేట అర్బన్ పార్క్‌లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పిట్. అర్బన్ పార్క్ (తేజోవనం) దాదాపుగా 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జింకలు, నెమలి, మూషిక జింకలు, వివిధ పక్షులున్నాయి. వాటి దాహార్తిని తీర్చేందుకు గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఐదు సాసర్ పిట్లను నిర్మించారు. వారానికి ఒకసారి వాటిని నీటిని నింపాలి. పార్కులోని నాలుగు సాసర్ పిట్లను పరిశీలించగా రెండు నీళ్లు లేక ఎండిపోయి ఉన్నాయి. మరో రెండింటిలో ఎప్పుడో పోసినవి కొన్ని నీళ్లుండగా దుర్వాసన వస్తోంది.
చిన్నకోడూరు మండలం మైలారం, అల్లిపూర్, చౌడారం గ్రామాలలో మొత్తంగా 1,100 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి ఉంది. అందులో జింకలు, అడవి పందులు, నెమలిలు, హైనాలు, చిరుత పులులు ఉన్నాయి. తాగునీరు లభించకపోవడంతో రాత్రి వేళ గ్రామాల్లోకి హైనాలు వస్తున్నాయి. పలు మార్లు గొర్రెలపై దాడి చేసిన సంఘటనలున్నాయి. చౌడారం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్‌లో పాకురు పట్టి.. కొద్దిగా నీళ్లు కనిపించాయి.
నిధులు రాగానే..
సాసర్ పిట్లలో నీటిని పోసేందుకు నిధులు మంజూరుకాలేదు. దీంతో నీళ్లు పోయడం లేదు. నిధులు రాగానే నీటిని పోయడం ప్రారంభిస్తాం. కొన్ని కుంటల ద్వారా జంతువులకు కొంత వరకు దాహం తీరుతోంది.
–జోజి, ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ
అరణ్య రోదన
అరణ్య రోదన
అరణ్య రోదన
అరణ్య రోదన
అరణ్య రోదన
అరణ్య రోదన


