చేర్యాల(సిద్దిపేట): విద్యార్థి జీవితంలో పదోతరగతి ఎంతో కీలకమైందని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యార్థినులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆమె కేజీబీవీని సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు కలెక్టర్ హోదాలో రావాలన్నారు. అలాగే హాస్టల్‌లో తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, పరిసరాలను పరిశీలించి హాస్టల్ నిర్వహణ, బోధన తీరుపై అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. అలాగే కుర్మవాడ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందజేస్తున్న భోజనం, పిల్లలతో టీచర్లు ఉంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్థానిక తహసీల్దార్ సమీర్ అహ్మద్‌ఖాన్, ఎంపీడీఓ మహబూబ్ అలీ, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, ఆర్‌ఐ రాజేదర్‌రెడ్డి ఉన్నారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్