వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Sep 20 2026 7:42 AM | Updated on Sep 20 2026 7:42 AM

నిజాంపేట(మెదక్‌): వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన నాలం రాజగౌడ్‌(71) శుక్రవారం రాత్రి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. సైకిల్‌పై వెళ్తూ స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఎదురుగా రోడ్డు దాటుతుండగా ఓ కారు ఢీకొట్టింది. గాయపడిన రాజగౌడ్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. రాజగౌడ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పదేళ్ల క్రితం మృతి చెందడంతో పెద్దకుమార్తె సులోచన తలకొరివి పెట్టింది. ఆ ఘటనతో గ్రామస్తులు విలపించారు.

వంటిమామిడి మార్కెట్‌ వద్ద

ములుగు(గజ్వేల్‌): ములుగు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్‌ఐ వి.రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్‌– మల్కాజిగిరి జిల్లా కీసర మండలం యాదగిరిపల్లికి చెందిన పుట్ట బాల్‌రాజు భార్య పుట్ట లక్ష్మి(37), మామ సోమయ్యతో కలసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వారు ముగ్గురు కలసి వంటిమామిడి మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి రహదారి దాటుతుండగా ఓ ట్రాక్టర్‌ లక్ష్మిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వర్గల్‌ మండలం గిర్మాపూర్‌ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పీర్లపల్లి యాదగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో..

చేగుంట(తూప్రాన్‌): విద్యుత్‌షాక్‌తో దివ్యాంగురాలు మృతి చెందిన ఘటన చేగుంటలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్‌కు చెందిన బాయికాడి సంధ్య(19) పుట్టుకతో దివ్యాంగురాలు. ఆమె కుటుంబం చేగుంటలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్నానం చేయించేందుకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు వాటర్‌హీటర్‌ తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురైన సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement