తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకున్న ఘటన తూప్రాన్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బోయవాడకు చెందిన బండారి నరసమ్మ(44) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. భర్తకు దూరంగా ఉండటంతో ఆమె పట్టణంలో ఒంటరిగా నివసిస్తోంది. పలువురి ఇళ్లలో పనులు చేసుకొంటూ కాలం వెల్లదీస్తోంది. ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై శనివారం తన ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గతంలో నరసమ్మ కుమారుడు సైతం ఇలాగే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబంలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఒంటరితనం భరించలేక..
కౌడిపల్లి(నర్సాపూర్): ఒంటరితనం భరించలేక మహిళ ఉరివేసుకున్న ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌడిపల్లికి చెందిన బర్ల మొగులమ్మ(55)కు ఇద్దరు కూతుళ్లు. భర్త శాఖయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అయిదేళ్ళ క్రితం కొడుకు కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె మొగులమ్మ ఇంటివద్ద ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఇంటి ఎదుట గేటుకు ఉరివేసుకుంది. ఆమె కూతురు సరిత ఫర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.


