సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులపై శాసీ్త్రయంగా విశ్లేషించాలాన్నారు. తరచూ ప్రమాదం జరుగుతున్న స్థలాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి, ప్రమాదాలు జరగకుండా అవసరమయ్యే చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు త్వరితగతిన సహాయక చర్యలు అందేలా చూడాలన్నారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాత శిశు మరణాల ఆడిట్‌తో పాటు శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మాతృశిశు మరణాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీలకు గర్భధారణ ప్రారంభం నుంచే నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ఆదేశించారు. హై రిస్క్ ఉన్నవారిని ముందుగానే గుర్తించి తక్షణమే ఉన్నత వైద్య కేంద్రాలకు రెఫర్ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్


