● మంత్రి వివేక్ ● జూకల్‌లో ఏటీసీ ప్రారంభోత్సవం
నారాయణఖేడ్: మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చి వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిద్దిడమే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాల (ఏటీసీ) ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులో రూ.47 కోట్లతో నిర్మించనున్న ఏటీసీ భవనానికి గురువారం ఆయన ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్‌లతో కలిసి శంకుస్థాప న చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనుకున్న 119 ఏటీసీల్లో ఇప్పటివరకు 65 కేంద్రాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. వీటి ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ ఏఐ ఆధారిత కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చి ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. పీఎం సేతు పథకం కింద రాష్ట్రంలో రూ.280 కోట్లతో పటాన్‌చెరు, సంగారెడ్డి, ఓల్డ్ సిటీలలో మూడు క్లస్టర్లు మంజూరయ్యాయని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులను ఈనెలాఖరులోగా చెల్లిస్తారని వివరించారు. జహీరాబాదు ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...ఖేడ్ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్నామన్నారు. వివిధ విద్యాసంస్థలు కాంగ్రెస్ హయాంలోనే మంజూరయ్యాయని వెల్లడించారు. ఏటీసీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ డైరెక్టర్ క్రాంతివెస్లీ, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, జూకల్ సర్పంచ్ రజిత పాల్గొన్నారు.


