వ్యక్తిగత శుభ్రత ముఖ్యం
● ముందు జాగ్రత్తలే మేలు ● పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మిరుదొడ్డి(దుబ్బాక): వర్షాకాలం ప్రారంభమైంది. నిండిపోయిన మురికి కాలువలు, ఇళ్ల మధ్య ఉన్న పెంట కుప్పలతో వ్యాధుల కాలం ఆరంభమైంది. కలుషితమైన నీటితో పాటు ఈగలు, దోమలు విజృంభించే కాలం ఆసన్నమైంది. పైపులైన్లు లీకేజీ కారణంగా తాగు నీరు కలుషితమవుతాయి. వర్షాల కారణంగా మురికి కాలువల్లో నీరు నిలిచిపోయి దోమలకు నిలయాలుగా మారుతాయి. పందులు, కుక్కలు స్వైరవిహారం చేయడంతో దోమల వృద్ధికి మరింత ఆజ్యం పోయడానికి అవకాశం ఉంది. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు విజృంభిస్తాయి. అప్రమత్తంగా లేకుంటే కుట్టేస్తాయి. ప్రాణాంతక వ్యాధులను కలిగిస్తాయి. వ్యాధులు వ్యాపించక ముందే ముందస్తు జాగ్రత్తలు చేపడితే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని డాక్టర్లు తెలుపుతున్నారు.
దోమ కాటుతో వచ్చే వ్యాధులు
● మలేరియా, పైలేరియా, డెంగీ, మెదడు వాపు, చికున్ గున్యా వంటి వ్యాధులు వస్తాయి.
● ప్రాణాంతకమైన వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి.
కలుషితమైన నీటితో..
● గ్రామీణ ప్రాంతాలల్లో తాగు నీటిని అందించే పైపులైన్లు లీకేజీతో కలుషితం అవుతాయి.
● ఫలితంగా డయోరియా (నీళ్ళ విరేచనాలు), కామెర్లు, టైఫాయిడ్, రక్త, బంక వీరేచనాలు, అమీభియాసిస్, ఫుడ్ పాయిజన్ (కలుషిత ఆహారం) వంటి వ్యాధులతో సతమతమయ్యే ప్రమాదం ఉంది.
నివారణ చర్యలు
● ఆహారం తినే ముందు, మలమూత్ర విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
● కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలి.
● శుభ్రంగా కడగని కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, మూతలు పెట్టని ఆహారాన్ని, కలుషితమైన ఆహారాన్ని భుజించరాదు.
● ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు, బొద్దింకలు వాలకుండా మూతలు పెట్టాలి.
● ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను వాడుకోవాలి.
● వర్షాకాలంలో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించకూడదు.
● అప్పటికప్పుడు వేడిగా ఉన్న ఆహారపదార్థాలనే భుజించాలి.
● వ్యవసాయ పొలాల్లో, చెరువులు, కుంటలు, కాలువల్లో పారే నీటిని తాగవద్దు.
పెచ్చరిల్లుతున్న ఈగలు
వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే వ్యాధులు దరి చేరవు. డయేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి. కలుషిత నీటితో సంభవించే డయేరియా రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సీజన్‌లో వచ్చే వ్యాధులపై ఇంటింటా ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, వ్యాధుల పట్ల అందరికీ అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– లింగమూర్తి, సీహెచ్‌ఓ, పీహెచ్‌సీ, మిరుదొడ్డి


