నారాయణఖేడ్: రాష్ట్రంలో టాటా కన్సల్టెన్సీ సహకారంతో రూ.4 వేల కోట్లతో 119 అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో రూ.47 కోట్లతో నిర్మించనున్న (ఏటీసీ) భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ..మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాలు సాధించేలా ఏటీసీల్లో అధునాతనమైన నూతన కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వీటిల్లో చదివే విద్యార్థులకు రూ.2 వేల చొప్పున స్టైఫండ్ అందించనున్నట్లు తెలిపారు. జర్మనీలో వివిధ వాటికి సంబంధించి 25 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉండగా టామ్కామ్ ద్వారా మందమర్రిలో జర్మనీ భాష నేర్చుకునే శిక్షణను ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జర్మనీ దేశంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. టామ్కామ్‌కు శిక్షణ కోసం రూ.90 కోట్లు కేటాయించినట్లు వివేక్ వివరించారు. ఖేడ్‌లో 50 మంది ఐటీఐ పూర్తి చేసిన యువత సిద్ధమైతే ఇక్కడ కూడా భోజన సదుపాయాలతో కలిసి ఉచితంగా జర్మనీ భాష శిక్షణ ఇచ్చి రూ.2.50లక్షల వేతనంతో ఆ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు.
ఏటీసీల ఏర్పాటుతో మేలు
జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు మూలంగా యువతకు పుష్కలంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని కార్మిక, ఉపాధికల్పనల శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు. జహీరాబాద్ మండలంలోని బూర్దిపాడ్ గ్రామ శివారులో రూ.46 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) భవన నిర్మాణం పనులకు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు.
మంత్రి వివేక్ వెల్లడి
జర్మనీ భాష నేర్పించి ఆ దేశంలోనే ఉద్యోగాలు


