సంగారెడ్డి జోన్: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి డా. క్రిస్టినా జడ్ చోంగ్తు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు, పురోగతిపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు అవసరమా అనే అంశాలపై జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి సేవలను మెరుగుపరచాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రజా పాలనలో వచ్చిన సమస్యలను మూడు విభాగాలుగా వర్గీకరించామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించే అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిన సమస్యల కోసం జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


