నారాయణఖేడ్: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని భూమయ్య కాలనీకి చెందిన దుర్గయ్య ఆదివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో సహా అక్కడికి వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండగా ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, 8 తులాల వెండినగలు, రూ.12 వేల నగదు చోరీ అయిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీంను రప్పించి ఇంట్లో ఆధారాలను సేకరించారు. స్థానిక సీఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.
మోటార్ల కేబుల్ వై ర్లు..
కొమురవెల్లి(సిద్దిపేట): వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం మండలంలోని కిష్టంపేట, గౌరాయపల్లి, పోసాన్‌పల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది రైతుల బోరుబావుల మోటార్ కేబుల్ వైర్లను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. కాగా ఉదయం పొలా లకు వెళ్లిన రైతులు కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. సుమారు కేబుల్ వైరు విలువ రూ.లక్ష ఉంటుందని వాపోయారు. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
జూదం ఆడుతున్న
ఐదుగురి అరెస్ట్
చిన్నశంకరంపేట(మెదక్): బొమ్మ–బొరుసు ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామ శివారులో బొమ్మ బొరుసు ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20,769 నగదు, 6 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కుమ్మరి లింగం, శ్రీరామ్ సతీశ్, పెంజర్ల రాజేందర్, దేవసోత్ దశరథ్, చాకలి వెంకటేశ్ ఉన్నారు. కాగా నవీన్‌రెడ్డి, రాజునాయక్ తప్పించుకున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సిద్దిపేటఅర్బన్: విద్యుదాఘాతానికి గురైన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంగ రాంరెడ్డి (65) ఈ నెల 14న రోజు మాదిరిగానే తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం పశువులకు నీళ్లు తాగించి మరో చోటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్ తీగ తగలడంతో కరంట్ షాకుకు గురయ్యాడు. గమనించిన పక్క పొలం రైతు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుమారులు కరుణాకర్‌రెడ్డి, లింగారెడ్డి అక్కడికి చేరుకొని గాయపడిన అతడ్ని 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత తిరిగి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
సిద్దిపేటకమాన్: కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ మురళి కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణం పశువుల అంగడి స్థలంలోని పాడుబడిన గదిలో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం రంగులో ఉన్న ప్యాంటు, షర్ట్ ధరించి, సుమారు 5.6అంగుళాల ఎత్తు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


