టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి
న్యాల్‌కల్(జహీరాబాద్): మనం సంపాదించిన దాంట్లో కొంత సొమ్మును సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండల పరిధిలోని చాల్కి ప్రాథమిక పాఠశాలలో సంస్థ అధ్వర్యంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లతో పాటు నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడిచినా ఇప్పటికీ పలు పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం విచాకరమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు తమ సంస్థ కూడా పలు సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తుందని వివరించారు. జిల్లాలోని 22 పాఠశాలల్లో పలు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకొని ఉన్నతా శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సుయోధ్య, ఎంఈఓ మారుతి రాథోడ్, సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


