మల్కాపూర్‌లో వ్యవసాయ భూమిలో వెంచర్
ఏర్పాటుకు సంబంధించిన కమ్యూనిటీ గేట్
● అక్రమ లే ఔట్‌లకు అధికారులే అండ
● అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు
● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న
అధికారులు
కొండాపూర్(సంగారెడ్డి): ప్రస్తుతం రియల్ ఎస్టేట్ తగ్గిపోవడంతో డబ్బులు సంపాదించుకోవడానికి రియల్ వ్యాపారులు మరో కొత్త పంథాను తెరమీదకు తీసుకువస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా వాటిని ప్లాట్‌లుగా మారుస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి అధికారులతోపాటు అధికారపార్టీకి చెందిన నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామం ప్రస్తుతం హాట్ కేక్‌లా మారింది. ఈ గ్రామ శివారులో గల సర్వే నం 158లో ఒక ఎకరా 8 గుంటల వ్యవసాయ పట్టా భూమిని కొంతమంది వ్యక్తులు సిండికేట్‌గా మారి అభివృద్ధి చేస్తామని రైతు వద్ద పర్సెంటీజీలుగా మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ భూముల్లో ప్లాట్‌లు చేయాలంటే తప్పనిసరిగా ఆ భూమిని నాన్‌అగ్రికల్చర్‌గా మార్చాలి. కానీ, ఈ నిబంధనలేవీ లేకుండానే వెంచర్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ భూమిలో ప్లాట్‌లు ఏర్పాటు చేసి బోర్‌లను కూడా ఏర్పాటు చేశారు. వెంచర్‌లో ఇళ్లు నిర్మించి వాటిని తక్కువ ధరలకే అంటూ విక్రయించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాపూర్ శివారులో రూ.30 వేల నుంచి సుమారు రూ.50 వేల వరకు గజం ధర ఉంది. ఒక వంద గజాల స్థలం కొనాలంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవుతుంది. అదే నిర్మించిన ఇల్లును మాత్రం రూ.50 లక్షలకే అంటూ వారిని మోసం చేసి వాటిని విక్రయించి అమాయక ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారు.
ప్రభుత్వ
ఆదాయానికి గండి
గ్రామాల్లో గల వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలి అంటే ముందుగా నాలా కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఆన్‌లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వెంచర్ ఏర్పాటు చేస్తే నిబంధనలకు అనుగుణంగా 40 ఫీట్‌ల రహదారితోపాటు అండర్ డ్రైనేజీ వ్యవస్థ, ఆడుకునేందుకు ఆటస్థలంతోపాటు హెచ్‌ఎండీఏ పర్మిషన్ ఉండాలి. ఇలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. మామూళ్లకు అలవాటు పడి అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
అనుమతుల్లేని వెంచర్‌లపై చర్యలు
కొండాపూర్ మండలం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉంది. ఈ మండలంలో వెంచర్‌లను ఏర్పాటు చేయాలంటే హెచ్‌ఎండీఏ పర్మిషన్ తీసుకోవాల్సింది. అక్రమ వెంచర్‌లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ముందుగా తక్కువ ధరకే ఇళ్లు అంటే కొని మోసపోవద్దు. – మల్లారెడ్డి,
జిల్లా పంచాయతీ అధికారి సంగారెడ్డి


