సంగారెడ్డి ఎడ్యుకేషన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు చోట్ల యోగా కార్యక్రమాలను నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని యోగాభవన్‌తోపాటు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యోగా డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలను వేశారు. ఈ యోగాసనాలు వేయడం వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్థులకు కేవలం కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు నిత్యావసర వస్తువులుగా మారిన తరుణంలో మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి నిత్య యోగా సాధనను మించిన ఔషధం మరొకటిలేదన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. యోగా శిక్షణ ద్వారా శారీరక, మానసిక రుగ్మతలైన బీపీ, షుగర్, నడుం, వెన్ను, మోకాళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని వివరించారు.


