మంత్రిని కలిసిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ప్రతినిధులు
హుస్నాబాద్: సర్ కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటరు జాబితాలో కొనసాగింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధి సుతారి సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మంత్రిని కలిసి చర్చించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటును కొనసాగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఆన్‌లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


