జోగిపేట(అదోల్)/చిలప్‌చెడ్ (నర్సాపూర్): మానసిక పరిస్థితి బాగా లేని వ్యక్తి ఆస్పత్రి నుంచి వెళ్లి నదిలో శవమై తేలాడు. ఈ సంఘటన జోగిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలో నివాసం ఉంటున్న మేకల బసంత్(45) మానసికంగా ఇబ్బందులకు గురి అవుతుండటంతో గురువారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు భార్య టీ తాగించిన అనంతరం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య తుల్జమ్మ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ఎలాంటి సమాచారం తెలియకపోగా ఆదివారం మధ్యాహ్నం చిలప్‌చెడ్ మంజీర నదిలో ఒడ్డుకు చేరిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా సర్పంచ్ అనీల్‌కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జోగిపేట పీఎస్‌లో మిస్సింగ్ కేసు ఉండటంతో మృతదేహాన్ని జోగిపేటకు తరలించారు.


