మొన్న భార్య.. నేడు భర్త | - | Sakshi
Sakshi News home page

మొన్న భార్య.. నేడు భర్త

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య

తూప్రాన్‌: భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఇస్లాంపూర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సాదుల వెంకటమ్మ ఈ నెల 17న కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుంది. కాగా అంత్యక్రియలు నిర్వహించినప్పటి నుంచి భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త భిక్షపతి(45) 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మండలంలోని బ్రాహ్మణపల్లి పమీపంలో భిక్షపతి ఓ చెట్టుకు ఉరివేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో..

సిద్దిపేటఅర్బన్‌: ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో ఆదివారం చోటుచేసుకుంది. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నల్లముత్తి వైష్ణవి(18) ఇటీవల జరిగిన ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉండటం గమనించారు. పొరుగువారి సహాయంతో తలుపులు తెరిచి చూడగా గదిలోని కిటికీకి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి నిఖిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అప్పుల బాధతో వ్యాపారి..

దుబ్బాకటౌన్‌: చేసిన అప్పులు తీర్చే మార్గం లేక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ కె.కీర్తిరాజు కథనం ప్రకారం... మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన ఎండీ సమీర్‌ (26) వివిధ వారాంతపు సంతల్లో చెప్పుల వ్యాపారం నిర్వహిస్తూ, భార్య ఫరానా బేగం, ఐదేళ్లలోపు ఉన్న ముగ్గురు కుమార్తెలు, తల్లిదండ్రులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల వ్యాపార నిర్వహణలో రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. దీంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక కొంత కాలంగా తనలో తాను బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం దుబ్బాకలో జరిగే సంతలో చెప్పులు అమ్మేందుకు సమీర్‌ ఎక్స్‌ఎల్‌ వాహనంపై చెప్పుల లోడ్‌తో వచ్చాడు. సాయంత్రం ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి, పట్టణ శివారులోని రామ సముద్రం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతకు వెళ్లిన కుమారుడు సాయంత్రమైనా తిరిగి రాకపోవడం, ఫోన్‌ స్విచ్చాఫ్‌ అవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి దుబ్బాకకు చేరుకొని గాలించారు. చెరువు కట్ట వద్ద ఎక్స్‌ఎల్‌, చెప్పులు, బండి తాళాలు ఉండడం చూసి, వెంటనే పోలీసులకు చెప్పారు. ఆదివారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందితో చెరువులో గాలించగా, సమీర్‌ మృతదేహం బయటపడింది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement