లేఖిని రచయితల సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి
కొండపాక(గజ్వేల్): విద్య, వైద్యం, సామాజిక , ధార్మిక సేవలకు కొండపాక నిలయమని హైదరా బాద్‌కు చెందిన లేఖిని రచయితల సంఘం అధ్యక్షురాలు అత్తులూరి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ఫాదర్స్ డేను పురస్కరించుకొని కొండపాక శివారులోని ఆనంద నిలయం, అష్టాదశ శక్తి పీఠం ఉమామహేశ్వర స్వామి దేవాలయం, బాలసదనం, గోశాలను లేఖిని రచయితల సంఘం సభ్యులు సందర్శించారు. మాజీ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ సలహాదారుడు కేవీ రమణాచారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, కామేశ్వరి, సరస్వతి, నళిని మాట్లాడుతూ.. ఆనంద నిలయం ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వృద్ధులకు ఆశ్రయం కల్పించడం అద్భుతమన్నారు. అష్టాదశ శక్తి పీఠం ఉమామహేశ్వర స్వామి దేవాలయంతో ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింతగా పెంచాయని చెప్పారు. ఆనంద నిలయం మేనేజర్ పార్థసారధి సేవా కార్యక్రమాల నిర్వహణ తీరును వారికి వివరించారు. అనంతరం అనాథలకు బట్టలు, పండ్లు, బిస్కట్లు తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లేఖిని రచయితల సంఘం బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


