ఖేడ్‌కు అంబేడ్కర్‌ స్టడీసర్కిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఖేడ్‌కు అంబేడ్కర్‌ స్టడీసర్కిల్‌

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి

నారాయణఖేడ్‌: ఖేడ్‌కు అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ మంజూరు కానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను హైదరాబాద్‌లో కలిసినట్లు తెలిపారు. ఖేడ్‌కు అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ ఆవశ్యకతను వివరిస్తూ నిధులను మంజూరు చేయాలని కోరగా మంత్రి లక్ష్మణ్‌ సానుకూలంగా స్పందిచినట్లు వివరించారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలోని పలు అభివృద్ధి పనులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించినట్లు తెలిపారు. మంజీరా నదిపై రోడ్‌కం డ్యామ్‌ నిర్మాణం గూర్చి ఇటీవల నిర్వహించిన సర్వే గూర్చి వివరించి నిధుల విడుదల కోసం కోరినట్లు చెప్పారు. పలు పనుల మంజూరుకు మంత్రి హామీనిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కను బహూకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

రాజీయే రాజమార్గం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర

సంగారెడ్డి టౌన్‌: లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొ న్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌అదాలత్‌ ద్వారా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించుకోవచ్చని, ప్రజలకు సులభమైన, వేగవంతమైన న్యాయం అందించడం కోసం వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజీమార్గంతో ఇరువర్గాల మధ్య తగాదాలను, పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం లబ్ధి పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌, కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్‌ అధికారులు, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

పెన్నార్‌ ఎన్నికల్లో

బీఆర్టీయూ హ్యాట్రిక్‌

46 ఓట్ల మెజార్టీతో గెలుపు

పటాన్‌చెరు టౌన్‌: జీపీ కాలనీ డివిజన్‌ పరిధిలోని బండ్లగూడ పెన్నార్‌ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయూ వరుసగా మూడోసారి విజయం సాధించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 465 ఓట్లకు గాను 460 ఓట్లు పోలవగా, బీఆర్టీయూకు 253 ఓట్లు, కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసిన సీఐటీయూకు 207 ఓట్లు లభించాయి. దీంతో బీఆర్టీయూ 46 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయోత్సవ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, సీనియర్‌ నాయకుడు గూడెం మధుసూదన్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌ మాట్లాడుతూ...ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి నాయకత్వంపై కార్మికులు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రతి కార్మికుడికి బంగారు భవిష్యత్తు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement