న్యాల్‌కల్(జహీరాబాద్): అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్‌పూర్ గ్రామ శివారులో బీదర్–జహీరాబాద్ రోడ్డుపై సోమవారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్‌ఐ సుజిత్ కథనం ప్రకారం... కర్నాటక, బీదర్ పట్టణానికి చెందిన రెహమాన్(22), చిన్నాన్న హజ్మత్ హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం బైకుపై బీదర్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని ఖలీల్‌పూర్ గ్రామ శివారులో నారింజ వాగు వద్ద అతివేగంగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రెహమాన్ ట్రక్కు టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. హజ్మత్‌కు తీవ్ర గాయాలు కాగా బీదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. బాధిత కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కొంతకాలంగా బీదర్–జహీరాబాద్ రోడ్డు అధ్వానంగా ఉందని ఖలీల్‌పూర్, మిర్జాపూర్(బి), కోత్తూర్, రేజింతల్ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంత్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు.
● మరొకరికి తీవ్ర గాయాలు
● ఖలీల్‌పూర్ గ్రామ శివారులో ఘటన


