మహిళ మెడలోంచి తస్కరణ
దొంగల కోసం గాలిస్తుండగా..
శివ్వంపేట(నర్సాపూర్): అర్ధరాత్రి దొంగలు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేశారు. ఈ ఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన మినంచంపేట జ్యోతికి మాటలు రావు. భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రోజువారిగానే మొదటి అంతస్తులో తల్లిదండ్రులు లక్ష్మి, నర్సింహులుతో కలిసి జ్యోతి పడుకుంది. మొదటి అంతస్తులో టాయిలెట్స్ లేకపోవడంతో జ్యోతి బాత్రూం కోసం అర్ధరాత్రి కిందకి దిగింది. ముఖాలకు మాస్క్‌లు వేసుకొని ఉన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోతుండటంతో ఆమె అరిచింది. ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడు, పైఅంతస్తులోని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు లేచి దొంగల కోసం గాలించగా కొద్ది దూరంలో చోరీ చేసిన బంగారు గొలుసు కిందపడి ఉంది. కాగా చోరీ అనంతరం జ్యోతి అరవడంతో దొంగలు హడావిడిలో వెళ్తున్న క్రమంలోనే బంగారు గొలుసు కిందపడి ఉండవచ్చని కాలనీవాసులు తెలిపారు. అర్ధరాత్రి దొంగల కోసం గాలించినా దొరకలేదు.
నార్లాపూర్ గ్రామంలో..
నిజాంపేట(మెదక్): మహిళ మెడలో బంగారు పుస్తెలతాడును స్కూటీపై వచ్చిన వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన అంబటి పెంటమ్మ తన ఇంటి ముందు కూర్చుంది. కాగా తెలుపు రంగు స్కూటీపై గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అడ్రస్ అడిగినట్లు నటించి మెడలోని బంగారు పుస్తెలతాడును లాగుతుండగా.. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించింది. దీంతో సుమారు అర తులం బంగారు పుస్తెను లాక్కొని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బస్సు ఢీకొని విద్యార్థి మృతి
సంగారెడ్డి : కొన్ని గంటలైతే బర్త్ డే పార్టీలో అనందంగా గడపాల్సిన విద్యార్థినిని మృత్యురూపంలో ఆర్టీసీ బస్సు కబలించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్‌ఐ విశ్వజన్ కథనం ప్రకారం... సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పుర్ర వైష్ణవి(13) ఏడో తరగతి పూర్తయింది. ఆదివారం పుల్కల్ మండలం మీన్‌పూర్ గ్రామం అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర తన మామ కూతురు పుట్టినరోజు వేడుకకు వచ్చింది. కాగా గ్రామంలోని పక్కింట్లో ఉన్న రమ్యశ్రీ సల్వాది విద్యాపీఠంలో భరతనాట్యం నేర్చుకుంటుండగా, ఆమెతో కలిసి వైష్ణవి, రమ్యశ్రీ తండ్రి బైక్‌పై పసల్ వాదికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జోగిపేట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు శివంపేట టోల్ ప్లాజా దాటిన తర్వాత హోన్నపూర్ శివారులో బైకును వెనక నుంచి ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వైష్ణవి రోడ్డుపై పడటంతో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఆమె పైనుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడిపిస్తున్న బాలరాజ్, అతని కూతురు గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా వైష్ణవి మృతితో పుల్కల్, సదాశివపేట మండలాల్లో విషాదం నెలకొంది. వైష్ణవి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్
సిద్దిపేటఅర్బన్: సామాన్య ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యంను అందుబాటులోకి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ డిమాండ్ చేశారు. కార్మిక, కర్షక భవన్‌లో జరుగుతున్న సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు రెండోరోజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధిక ఫీజులు, డొనేషన్ల రూపంలో వేలాది కోట్లు కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు దండుకుంటున్నాయన్నారు. శిక్షణ తరగతుల్లో సీపీఎం నాయకులు మల్లారెడ్డి, గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, కృష్ణారెడ్డి, వెంకట్, రవికుమార్, యాదగిరి పాల్గొన్నారు.


