● నిధుల లేమితో సమస్యలు ● గడువులోపు పూర్తికాని పనులు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను మెరుగుపర్చడానికి చేపడుతున్న అమృత్ తాగునీటి పథకం పనుల్లో జాప్యం జరుగుతోంది. చేపట్టిన పనులు నత్తనడక సాగుతున్నాయి. రెండు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వేసవిలో ప్రజలు తాగు నీటి కోసం తంటాలు పడక తప్పలేదు. జహీరాబాద్ మున్సిపాలిటీ జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. పట్టణం చుట్టూ ఉన్న పస్తాపూర్, అల్లీపూర్, చిన్న హైదరాబాద్, రంజోల్, హోతి(కె) ఐదు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో జనాభా సుమారు 1.25 లక్షలకు చేరుకొగా వార్డుల సంఖ్య 24 నుంచి 37 వార్డులకు పెరిగింది. ప్రజల నీటి అవసరాలు కూడా పెరిగాయి. పట్టణ ప్రజలకు ప్రతి రోజు 1.70 కోట్ల లీటర్ నీటి అవసరం కాగా మిషన్‌భగీరథ పథకం కింద సుమారు 80 లక్షలు, బోరు మోటార్ల ద్వారా మరో 20 లక్షల లీటర్లు నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. కానీ పలు కారణాల వల్ల 70 లక్షల లీటర్ల నీటి సరఫరా కూడా జరగడం లేదు.
రూ.66 కోట్లు మంజూరు
పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో అమృత్ 2.0 పథకం కింద రూ. 66 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాయికోడ్ మండలంలోని ఇటికెపల్లి వద్ద గల మంజీరా నది నుంచి అమృత్ పథకం పైపులైన్ పనులు ప్రారంభించారు. సుమారు 50 కిలో మీటరు మేర కొత్త పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం పనులు మాత్రమే పూర్తిచేయడం జరిగింది. ఇంకా పైపులైన్, ట్యాంక్‌ల పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు కొరత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనుల అమలులో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి, ఇప్పటికై నా అధికారులు స్పందించి అమృతి పథకం పనులు పూర్తి చేయాలిని ప్రజలు కోరుతున్నారు.


