దమ్ముంటే ఇంటి దొంగను బయటపెట్టండి | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ఇంటి దొంగను బయటపెట్టండి

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

మీనాక్షికి ద్రోహం చేసింది కాంగ్రెస్‌ వారే..

ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ విమర్శ

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మీనాక్షి నటరాజన్‌కు ద్రోహం చేసింది కాంగ్రెస్‌ పార్టీ వారేనని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్‌ ఆరోపించారు. ఆమె నామినేషన్‌ను తిరస్కరించేలా సమాచారం ఇచ్చింది ఆ పార్టీ నాయకులేనన్న ఆరోపణలపై పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ ఇంటి దొంగ పేరు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ సర్కారు అవినీతి అక్రమాలను డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆధారాలతో సహా బయటపెడుతుంటే వాటికి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తన పదవి కోసమే జగ్గారెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీనాక్షికి ద్రోహం చేసింది సీఎం వర్గమే అని తెలిసినా జగ్గారెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. సంగారెడ్డి ప్రజల చేతిలో ఓటమి పాలైన జగ్గారెడ్డికి, ప్రజల గుండెల్లో ఉండే హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌లో ఎవరైనా కోవర్టులు ఉంటే తోడ్కల్‌ తీస్తామన్న జగ్గారెడ్డి.. సీఎం అనుచరుడైన కోవర్టు పేరు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీ కోవర్టు అని, పార్టీని నాశనం చేసేందుకు వచ్చాడని, బ్లాక్‌ మెయిలర్‌ అంటూ తిట్టిన జగ్గారెడ్డి.. ఇప్పుడు పదవిని కాపాడుకునేందుకు రేవంత్‌రెడ్డికి వంత పాడుతున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement