కాపరి మృత్యువాత ● కొట్టాలలో విషాదం
కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులోకి దిగిన గొర్రెను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఓ కాపరి యత్నించి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొట్టాలలో గురువారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పద్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త రెండేళ్ల క్రితం కరెంట్‌షాతో మృతి చెందగా.. తల్లి పిల్లలను పోషిస్తుంది. పెద్దకొడుకు బన్నీ(16) గ్రామంలోని తెలిసిన వారి మేకలు మేపేందుకు చౌదరి చెరువు వైపు వెళ్లాడు. అక్కడే లింగంపల్లికి చెందిన పలువురు వ్యక్తులు గొర్రెలు మేపుతున్నారు. అందరూ కలిసి అక్కడే మేపుతున్నారు. కాగా అక్కడ ఒక గొర్రె చెరువులోకి దిగగా.. లింగంపల్లి గొర్రెల కాపరులు బన్నీతో గొర్రెను ఒడ్డుకు కొట్టుకు రమ్మని చెప్పడంతో చెరువులోకి దిగాడు. చెరువులో జేసీబీ గుంతలు ఉండటంతో బన్నీకి ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.


