క్యాన్సర్‌ కోరల్లో బాలుడు | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ కోరల్లో బాలుడు

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

● భారమవుతున్న వైద్యం ఖర్చులు ● ఇవాన్ష్‌ బతుకు పోరాటం ● ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

పాపన్నపేట(మెదక్‌): ఆడి పాడాల్సిన బాల్యం.. ఆసుపత్రుల్లో గడుస్తోంది. ఏడేళ్లు నిండని చిన్నారిని క్యాన్సర్‌ వ్యాధి సోకింది. తినడానికి తిండి లేని నిరుపేద కుటుంబానికి ఖరీదైన వైద్యం భారంగా మారుతోంది. పొత్తిళ్లలోనే ఇద్దరు కొడుకులు పోగా.. మిగిలిన ఒక్క కొడుకును చూసుకొని బతుకు ఈడుద్దామంటే.. భయంకరమైన వ్యాధి తల్లి దండ్రుల ఆశలను ఆవిరి చేసింది. మనవడి దీనావస్థను భరించే శక్తి లేక.. మనోవ్యాధితో మంచం పట్టి తాత గంగారాం కన్ను మూశాడు. చిన్న పాటి జ్వరం వచ్చినా.. పట్నం వెళ్లాలి. ప్రతి నెలా మందుల కోసం పరుగులు తీయాలి. పూట గడువని స్థితిలో ఖరీదైన వైద్యం కోసం ఇవాన్ష్‌ జీవన పోరాటం చేస్తున్నాడు.

పాపన్నపేటకు చెందిన సాయిబాబ, శోభ దంపతులకు ఎకరా పొలమే జీవనాధారం. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్న దంపతుల సంసారంపై విధి పంజా విసిరింది. ఇంటిళ/్లపాదిని అనునిత్యం అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 2015లో వారి పెళ్లి కాగా, 2016లో మొదటి బాబు జన్మించిన ఐదు రోజుల్లోనే చనిపోవడంతో వారి ఆనందం ఆవిరైంది. 2019లో ఇవాన్ష్‌ జన్మించాడు. 2024లో మరో బాబు పుట్టిన వారం రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. అనంతరం 2025లో యశస్విని జన్మించింది. ప్రసూతి సమయంలో శోభ తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, రూ.6 లక్షల అప్పులు చేసి, భార్యను కాపాడుకున్నాడు సాయిబాబ. కాగా పాఠశాలకు వెళ్తున్న తరుణంలో ‘గోటి చుట్టుపై రోకటి పోటులా’2024లో ఇవాన్ష్‌ బ్లడ్‌ క్యాన్సన్‌ బారిన పడ్డాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. మందులు ఉచితంగానే ఇస్తున్నా, నెలకోసారి వీరు వెళ్లినప్పుడు అక్కడ మందులు లేక పోతే రూ.10 వేలు పెట్టి, బయట ప్రైవేట్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. అలాగే నెలకోసారి తప్పకుండా పరీక్షల కోసం పట్నం వెళ్లాలి. ఇక చిన్న జ్వరం వచ్చినా, జలుబు అయినా, స్థానిక వైద్యాన్ని ఆశ్రయించకుండా, విధిగా హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తుందని సాయిబాబ కన్నీరు పెట్టాడు. అందరి పిల్లల్లా ఆడుకోవాల్సిన తన బిడ్డ జీవితం ఇలా, గాజు బొమ్మలా మారిందని వాపోయారు. మనసున్న మా రాజులు ఎవరైనా ఉంటే 8096106545 నంబర్‌కు ఫోన్‌ పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement