తక్కువ ధరకు పంపిణీ
● రైతుల వద్ద మద్దతుధరకు కొనుగోళ్లు ● జొన్న రైతులకు భారీగా లబ్ధి
రైతు వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేసి పేదలైన వినియోగదారులకు
ప్రజా పంపిణీ ద్వారా తక్కువ ధరకు
జొన్నలను అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇరువర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రావతరణ రోజైన జూన్ 2 నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సంగారెడ్డి జోన్/నారాయణఖేడ్: ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో భారీగానే జొన్న సాగు జరిగింది. ఈ పంట కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. కేంద్రం జొన్న హైబ్రీడ్ రకానికి రూ.3,699 మద్దతు ధర ప్రకటించింది. రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జొన్న, మొక్కజొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మద్దతు ధర ప్రకటించిన కేంద్రం పంటను కొనుగోలు చేపట్టాలి. కేవలం మద్దతుధర (ఎంఎస్‌పీ) ప్రకటించి కేంద్రం వదిలేస్తుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్రం కోరినా స్పందన కన్పించడంలేదు. బహిరంగ మార్కెట్‌లో ధర లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ప్రజా పంపిణీ ద్వారా జొన్నలు
సాధారణంగా ప్రభుత్వం సేకరించిన సరుకులను బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తుంది. దీన్ని అదునుగా తీసుకునే మధ్యవర్తులు తక్కువ ధరకే దక్కించుకుని లాభపడటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజలకే తక్కువ ధరకు అందించాలని నిర్ణయిచింది. వీరితోపాటు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు పోషకాహారం అందించడంలో భాగంగా జొన్నలను వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. చిరుధాన్యాల వాడకాన్ని పెంచడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లాలోని రేషన్ దుకాణాలు 855
రేషన్‌కార్డుదారులు 4,42,746
రేషన్‌కార్డుల సభ్యులు 14,93,876
సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం
జిల్లాలో సాగవుతున్న పంటలలో వాణిజ్య పంటలే అత్యధికంగా ఉన్నాయి. చిరుధాన్యాల పంటల సాగు అంతంతమాత్రంగానే ఉంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని మండలాల్లోనూ చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక మద్దతును అందిస్తుంది.
జిల్లాలో 92,497 ఎకరాల్లో సాగు..
జిల్లాలో 92,497.03 ఎకరాల్లో జొన్న పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా ఖేడ్ వ్యవసాయ డివిజన్ పరిధిలో 50,408.07 ఎకరాల్లో సాగు చేశారు. ఆందోల్, చౌటకూర్, హత్నూర, పుల్కల్ మండలాల్లో కలిపి 2,724 ఎకరాల్లో, మునిపల్లి, రాయికోడ్, వట్‌పల్లి మండలాల్లో కలిపి 15,432 ఎకరాల్లో, కొండాపూర్, సదాశివపేట్, సంగారెడ్డి మండలాల్లో కలిపి 10,538 ఎకరాలు, జహీరాబాద్ డివిజన్‌లో 13,316 ఎకరాల్లో సాగు చేశారు.


