జహీరాబాద్ టౌన్: ఇటీవల కాలంలో పలు కారణాల వల్ల మామిడి రైతులు నష్టాలు చూస్తున్నారు. పూత నుంచి కోతకు వచ్చే వరకు కాయలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగళ్లు, గాలి దుమారం, చీడపీడల బెడదలతో మామిడిపంటకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యలను నుంచి అధిగమిచండానికి రక్షణ కవర్లు అందుబాటులోకి వచ్చాయి. కాయలకు కవర్లు కట్టడం వల్ల పండ్ల నాణ్యత ప్రమాణాలు పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కవర్లు కట్టి పండించిన పండ్లకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. దీంతో కవర్ల వాడకం ప్రతీ ఏటా పెరుగుతోంది. ప్రభుత్వం కూడా కవర్లకు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ కవర్ల వినియోగం పట్ల రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు.
తెగుళ్లకు రక్షణగా...
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పూత పూసినా..కాత నిలబడటం లేదు. తెగుళ్ల బెడద తీవ్రంగా వేధిస్తోంది. నల్లతామర, పండు ఈగ, తేనె మంచు, మసి, బంగ తెగుళ్ల నుంచి మామిడి కాయలను కాపాడుకునేందుకు రక్షణ కవర్లు కడుతున్నారు. కాయకు కవర్ కట్టే విధానం వల్ల అనేక లాభాలున్నాయి. కోడిగుడ్డు సైజులోకి రాగానే ఒక్కో కాయకు ఒక్కో కవర్ కడుతారు. కాయలకు కవర్లు కట్టడం వల్ల తొడిమ వద్ద నల్లగా మసి, పురుగు పట్టడం, సొన కారడం తగ్గుతుంది. దీంతో పురుగు మందుల అవసరం చాలా వరకు ఉండదు. గాలి దుమారం, వడగళ్లవానకు కాయ రాలదు. మామూలు కాయకంటే బరువు ఎక్కువగా ఉంటుంది. పండ్లు చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 70 రోజుల తర్వాత నాణ్యమైన దిగుబడి వస్తుంది. చెట్టుపైనే పండటం వల్ల అధిక ధర పలుకుతుంది. జిల్లాలోని జహీరాబాద్, కోహీర్ తదితర మండలాల్లోని రైతులు కాయలకు కవర్లు కట్టడం చేస్తున్నారు.
కవర్ కాయకు భలే డిమాండ్
ఒక్కో కవర్(బ్యాగ్) రూ.2.50 పైసలకు లభిస్తుంది. కట్టడానికి రూ.2.50 కూలీ ఖర్చు అవుతుంది. ఈ బ్యాగ్ లోపల నల్లరంగులో, బయట గోధమ రంగులో ఉంటుంది. వీటిని కట్టడానికి ముందు కాయలను బట్టతో శుభ్రంగా కడగాలి. కాయ కింది భాగం నుంచి తొడిమ పైభాగంలో మూడు సెంటీమీటర్ల పైన కట్టాలి. కవర్లు కట్టిన తర్వాత ఏ కాయలు ఎప్పుడు కోతకు వస్తుందో రైతులకు తెలుస్తుంది. సాధారణ మామిడికాయలు టన్నుకు రూ.30 వేల వరకు పలుకుతుండగా మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ తొడిగినవి టన్నుకు రూ.70 వరకు పలుకుతుంది. ఉద్యానశాఖ కూడా కవర్లకు సబ్సిడీ ఇస్తుంది. కవర్‌కు రూ.1 వరకు ఎకరానికి రూ.10 వేల సబ్సిడీ ఇస్తుంది. కవర్లు కట్టిన కాయలు నాణ్యతగా ఉంటాయి. దీంతో మార్కెట్‌లో వీటికి భలే డిమాండ్ ఉంటోంది.
వాడకంపై అవగాహన
మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల కలిగే లాభాల ఉద్యానశాఖ అధికారులు రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మండలంలోని హోతి(బి),రంజోల్ గ్రామ పరిధిలోని మామిడి తోటల వద్ద రైతులకు కవర్లు కట్టడంపై ప్రదర్శనలు ఇస్తున్నారు.
నాణ్యమైన మామిడి
దిగుబడికి దోహదం
ఆసక్తి చూపుతున్న రైతులు
పెరుగుతున్న వినియోగం
సబ్సిడీ ఇస్త్తున్న ఉద్యానశాఖ


