ఐదు నెలలైనా ఇంకా పనులప్రతిపాదనలే పంపని ఎమ్మెల్యేలు
స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌వినియోగం తీరు ఇది
ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు కేటాయింపు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రత్యేకాభివృద్ధి నిధులు (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్–ఎస్‌డీఎఫ్) ప్రతిపాదనల దశ దాటడం లేదు. ఈ నిధులొచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఈ అభివృద్ధి పనులు పట్టాలెక్కడం లేదు. కనీసం ఈ నిధులతో ఏ అభివృద్ధి పనులు చేపడతారో కూడా ఇంతవరకు ఖరారు కాకపోవడం గమనార్హం. ఎమ్మెల్యేలకు కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీపీ) మంజూరును ప్రభుత్వం నిలిపివేసిన విషయం విదితమే. దీని స్థానంలో ఎస్‌డీఎఫ్ నిధులను కేటాయిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల చొప్పున కేటాయింపులు చేస్తూ 2025 నవంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్, ఖేడ్ నియోజకవర్గాలకు ఈ నిధులను కేటాయించారు. అలాగే గతంలో కాంగ్రెస్‌తో సన్నిహితంగా వ్యవహరించిన గూడెం మహిపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్‌చెరుకు కూడా ఈ నిధులు మంజూరయ్యాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి, జహీరాబాద్‌కు ఈ నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. ఈ రెండు నియోజకవర్గాలకు రెండో విడతలో కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు.
పనులే ప్రతిపాదించలేదు..
ఈ ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టనున్న పనులను స్థానిక ఎమ్మెల్యేలు నిర్ణయించాల్సి ఉంటుంది. వారు ప్రతిపాదించిన పనులనే ఈ నిధులతో చేపడతారు. అయితే నిధులు కేటాయింపులు జరిపి ఐదు నెలలు గడుస్తున్నా ప్రతిపాదనలు మాత్రం ఇంకా రాలేదు. ఈ నిధుల కేటాయింపులు చేశాక గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 కార్యక్రమం కొనసాగుతోంది. వీటి కారణంగా పనులను ప్రతిపాదించలేకపోయినట్లు తెలుస్తోంది.
గూడెం’ప్రతిపాదనలకు
ఆమోదముద్ర పడేనా!
ఈ నిధులతో చేపట్టనున్న పనులకు ఇన్‌చార్జి మంత్రి వివేక్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే తిరిగి బీఆర్‌ఎస్‌కు దగ్గరైన గూడెం మహిపాల్‌రెడ్డి ఈ పనులకు ప్రతిపాదనలు పంపుతారా? ఆయన పంపిన ప్రతిపాదనలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ ఆమోదముద్ర వేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆందోల్, ఖేడ్‌లో అధికార పార్టీకి చెందిన వారే కావడంతో వారు ప్రతిపాదనలకు ఇన్‌చార్జి మంత్రి ఆమోదం ముద్ర పడుతుంది. కానీ పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించి గూడెం ప్రతిపాదించిన పనుల ఆమోదం విషయంలో ఇన్‌చార్జి మంత్రి తీరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది.
తమకు కేటాయించిన ఎస్‌డీఎఫ్ నిధులకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు పంపాలని కలెక్టరేట్ నుంచి ఆయా ఎమ్మెల్యేలకు రిమైండర్లు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే పనులను ప్రతిపాదించి వాటిని వినియోగించుకోవాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ముగిసింది. వెంటనే ప్రతిపాదనలు పంపితే పనులు ప్రారంభించేందుకు వీలవుతుందని రిమైండర్లలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


