డ్రైవర్లు కావలెను: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్లు కావలెను: ఎస్పీ

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

సంగారెడ్డి జోన్‌: ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ సూచించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సంగారెడ్డి బస్‌ డిపోను ఆయన సందర్శించి అక్కడి బందోబస్తు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. డిపోలో ఉన్న ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బస్సులు, ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌, రవాణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బస్సులు నడపడానికి అర్హత కలిగిన డ్రైవర్లు ముందుకు రావాలని కోరారు. ఆసక్తి ఉన్న డ్రైవర్లు జిల్లా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 8712656739కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ ఉపేందర్‌, డీఎస్పీ సత్తయ్య గౌడ్‌, ఇన్‌స్పెక్టర్‌ రామునాయుడు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి, కొండాపూర్‌ సీఐ కుమన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

మునిపల్లి(అందోల్‌): కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని తెలంగాణ ప్రజలకు తాగు, సాగుకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని ఖమ్మంపల్లి మాజీ జెడ్పీటీసీ మీనాక్షి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల తాగు, సాగు నీటి కోసం కేసీఆర్‌ కాళేశ్వరాన్ని రూ.90 వేల కోట్లతో నిర్మించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై కక్ష సాధింపుతోనే రెండేళ్ల కాలం వృథా చేశారని దుయ్యబట్టారు. రైతులకు రైతు భరోసా మంజూరు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డి, సాయికుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్‌, ఆయా మండలాల నాయకులతో పాటు మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకలు పాల్గొన్నారు.

ఉపాధిపనుల్లోకూలీల సంఖ్య పెంచాలి

జిల్లా పరిషత్‌ సీఈవో జానకిరామ్‌

హత్నూర (సంగారెడ్డి): జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతీ కూలీ ఉపాధి పనికి వచ్చేలా కృషి చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవో జానకిరామ్‌ స్పష్టం చేశారు. హత్నూర రైతువేదికలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఉపాధిహామీ పథకంలో కూలీలను పెంచాలనే అంశంపై గురువారం నిర్వహించిన సమావేశంలో జానకిరామ్‌ పాల్గొని మాట్లాడారు. ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే కూలీలను పనులకు తీసుకెళ్లాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ బాలరాజ్‌, క్లస్టర్‌ ఏపీ డి.మధులత, ఎంపీడీవో శంకర్‌, ఎంపీఓ యూసుఫ్‌, ఏపీవో ప్రవీణ్‌ కుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

హైకోర్టు తీర్పు

కాంగ్రెస్‌కు చెంపపెట్టు

మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఖేడ్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులపై లేనిపోని ఆరోపణలు చేసి రెండున్నరేళ్ళు పబ్బం గడిపారని మండిపడ్డారు. ఇకనైనా కళ్లు తెరిచి రెండు పిల్లర్లకు మరమ్మతులు చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొచ్చి రైతులకు ప్రయోజనం కలిగించేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement