నేటి నుంచి వేసవి సెలవులు
● జూన్ 12న పునః ప్రారంభం ● ఆటల్లో మునిగి తేలనున్న విద్యార్థులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు పాఠశాలకు బై బై చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. తిరిగి జూన్ 12 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో బడులను తెరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ
పాఠశాలలకు చివరి రోజు కావడంతో ప్రతీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులు చదువుతున్న తరగతికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేశారు. ఔట్‌డోర్ గేమ్స్‌పై కాకుండా ఇండోర్ గేమ్స్‌పై దృష్టి సారించేలా చూడాలన్నారు. అదేవిధంగా సెలవులను వృథా చేయకుండా కంప్యూటర్ కోర్సులు వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చి చదువుపై దృష్టి మరల్చకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు.
వేసవి శిక్షణ తరగతులు
వేసవి సెలవులు వస్తే చాలు విద్యార్థుల ఆటపాటలు, కబుర్లు కాలక్షేపాలతో చేసే సందడి అంతా ఇంతా కాదు. కొంతమంది విద్యార్థులు మాత్రం సెలవులను వృథా చేయకుండా, భవిష్యత్‌లో ఉన్నత చదువులకు అవసరమయ్యే వివిధ కోర్సులపై దృష్టి సారిస్తారు. ఇందులోభాగంగా స్పోకెన్ ఇంగ్లీషు, పదవ తరగతి కోసం ప్రత్యేకంగా ట్యూషన్‌లు, సంగీతం, నాట్యం, స్విమ్మింగ్, కరాటే, క్రికెట్ కోచింగ్ తదితర శిక్షణ కోర్సులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు, పోటీ పరీక్షలు, ఉపాధి అంశాలకు సంబంధించిన కోచింగ్ సెంటర్లపై దృష్టి సారిస్తున్నారు.


