కాళేశ్వరం హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సంబంధించి హైకోర్టు వెలువరించిన తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులు నైతిక విజయం సాధించారని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్‌పై బురద చల్లాలని చూస్తోందని విమర్శించారు. చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం బాగుకోసం రేయింబవళ్లు శ్రమించి కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారన్నారు. బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ పార్టీ ముఖ్య నేతలను ఘోష్ కమిషన్ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జి.గుండప్ప, బీఆర్‌ఎస్ నాయకులు తట్టు నారాయణ, నర్సింహులు, బండి మోహన్, యాకూబ్, గౌస్ పాల్గొన్నారు.


