సేంద్రియ వ్యవసాయమే మేలు
ఝరాసంగం(జహీరాబాద్): సేంద్రియ వ్యవసాయంతోనే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని పర్మాకల్చర్ అరణ్య వ్యవసాయ శాశ్వత సంస్థ ప్రతినిధి కొప్పుల పద్మ సూచించారు. హైదరాబాద్‌లోని లయోలా బీఎస్సీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు గురువారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బిడెకన్నెలోని అరణ్య సంస్థలో సేంద్రియ సాగు విధానం, నర్సాపూర్‌లో బయోచార్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. సేంద్రియ పద్ధతి, చెట్ల ఆకులు కలిపి పంటలు సాగు చేసే విధానాలపై అధ్యయనం చేశారు. పంట వ్యర్థాలతో తయారు చేస్తున్న బయోచార్ ఎరువును పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సహజ పద్ధతిలో పండించే పంటలను ఆహారంగా తీసుకోవడంతోనే ఆరోగ్యం సాధ్యమన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడంతో భూసారం నాశనం కావడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.


