బంజారాల సంక్షేమానికి కృషి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
దుబ్బాక: బంజారాల సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా దుబ్బాకలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివాజి చౌరస్తా నుంచి పాత తహసీల్దార్ కార్యాలయం వరకు బంజారాల నృత్యాలు, ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవ, సత్యం, సామాజిక న్యాయం అనే విలువలను బోధిస్తూ బంజారాలను ఐక్యతవైపు న డిపించిన మహనీయుడు సేవాలాల్ అని అన్నారు. ఆయన బోధనలు సమాజానికి మార్గనిర్దేశమన్నారు. బంజారా భవనం నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత, వైస్ చైర్ పర్సన్ ఆస సులోచన, కౌన్సిలర్ బండి శ్రీలేఖ తదితరులు ఉన్నారు.


