సర్పంచ్ భర్తపై దాడి
అక్కన్నపేట(హుస్నాబాద్): భూ కబ్జా చేశారని ఫిర్యాదు చేసినందుకు సర్పంచ్ భర్తపై దాడికి పాల్పడారు. ఈ సంఘటన మండలంలోని సేవాలాల్ మహారాజ్ తండా గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... సర్పంచ్ జరుపుల సునీత భర్త రాజునాయక్‌పై రాత్రి బైక్‌పై హుస్నాబాద్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి సమీపంలో ఐదారుగురు వ్యక్తులు కలిసి ఆయనపై దాడికి పాల్పడ్డారు. అయితే, గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితులకు నందారం క్రాసింగ్ వద్ద ప్రభుత్వం పునరావాస కాలనీ ఏర్పాటు చేసింది. ఈ కాలనీలో సుమారు 185కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరి సౌకర్యాల కోసం ప్రభుత్వం రోడ్డు వైపు సుమారు 4గుంటల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలాన్ని పునరావాస కాలనీకి చెందిన ఒకరిద్దరూ కబ్జా చేశారని, ఆ స్థలంలో గ్రామపంచాయతీ భవనం నిర్మాణం చేపడతామని సర్పంచ్ శనివారం ఉదయం గ్రామస్తులతో చర్చించారు. కబ్జా విషయంపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని తండాకు చెందిన హరిలాల్, కిషన్‌లతో పాటు మరో ముగ్గురు తన భర్తపై దాడి చేసి త్రీవంగా గాయపరిచారని సర్పంచ్ సునీత ఆరోపించారు. ఈ విషయంపై ఎస్‌ఐ ప్రశాంత్‌ను సాక్షి వివరణ కోరగా సర్పంచ్ భర్తపై దాడి జరిగిన విషయం తెలిసిందని, వారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామన్నారు.


