ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తికి గాయాలు
గజ్వేల్‌రూరల్: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సులో నుంచి జారిపడి వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట ప్రాంతానికి చెందిన గోపాల్ గజ్వేల్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆర్టీసీ బస్సులో సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ సమీపంలోకి రాగానే బస్సు డోర్ వద్దకు వచ్చి దిగేందుకు నిల్చున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడంతో అతని తలకు, కాలికి గాయాలయ్యాయి. వెంటనే బస్సును ఆపి గాయాలకు గురైన గోపాల్‌ను 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సైతం సమాచారం అందించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు గోపాల్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.


