రోడ్డు ప్రమాదంలో తండ్రీ,కొడుకులు మృతి
● ఎదురెదురుగా ఢీకొన్న లారీ, బైక్ ● బాలికకు తీవ్ర గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక)/తొగుట(దుబ్బాక): ఊరిపై పెంచుకున్న మమకారాన్ని రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకులు మృత్యువాత పడగా, ఓ చిన్నారి మృత్యువుతో పోరాడుతుంది. ఈ విషాద ఘటన తొగుట మండలంలోని జప్తి లింగారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సల్మెడ కుమార చారి (39), భార్య షాలిని, ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో వడ్రంగి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల సంక్రాంతి పండుగకు స్వగ్రామమైన ధర్మారానికి వచ్చాడు. బంధు, మిత్రులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. అనంతనం తిరిగి ఘట్‌కేసర్‌కు తన కుటుంబ సభ్యులతో శనివారం పయనమయ్యారు. కాగా భార్య షాలినితోపాటు, చిన్న కుమారుడిని ఆర్టీసీ బస్సులో పంపించాడు. తన పెద్ద కుమారుడు సుషాంత్ (7), అక్క కూతురు రమ్మశ్రీతో కలిసి బైక్‌పై బయలు దేరారు. ఈ క్రమంలో తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి బస్ స్టేజీ సమీపంలో లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుషాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కన్న కొడుకు విగత జీవిగా మారడంతో, గాయాలతో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న కుమార చారి వేదన అక్కడున్న ప్రతి ఒక్కరిని చలింపజేసింది. కాగా కుమార చారి, రమ్యశ్రీని పోలీసులు అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కుమార చారి మృతి చెందాడు.
ధర్మారంలో విషాద ఛాయలు
తండ్రీ, కొడుకులు మృతితో ధర్మారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఊరిపై పెంచుకున్న మమకారం విషాదంగా మారడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రీ,కొడుకులు మృతి


