
సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ
ఆడుతూ పాడుతూ... ఆహ్లాదకర వాతావరణం మధ్య మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య మాత్రమే ఇన్నాళ్లూ ఉండగా ఇక నుంచి ప్రీప్రైమరీని ప్రారంభించనుంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా వాటి ధాటి నుంచి పేద పిల్లలకు ఉపశమనం కల్పించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 790 ప్రీప్రైమరీ పాఠశాలలను రెండో విడతగా మంజూరు చేయగా సంగారెడ్డి జిల్లాకు 58 పాఠశాలలు, మెదక్ జిల్లాకు 30 మంజూరయ్యాయి. ఈ జిల్లాల్లో ఇదివరకే ఎంపిక చేసిన ఆయా పాఠశాలల్లో ప్రీప్రైమరీని కొనసాగించనున్నారు.
– నారాయణఖేడ్:
విద్యా సంవత్సరమే ఎంపిక
రానున్న ఏడాది 1వ తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2025– 26 విద్యా సంవత్సరమే ప్రీప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. పాఠశాలలకు సిద్ధం చేయడం, ప్రాథమిక అభ్యాసం అందించడం దీని ప్రధాన కర్తవ్యం. ప్రీప్రైమరీ విభాగానికి ప్రత్యేక తరగతి గదిని కేటాయించాలి. అందులో పిల్లలకు అనుకూలమైన ఫర్నీచర్, తగిన ప్రదర్శనలు, సరైన వెలుతురు, ఇండోర్, ఔట్‌డోర్ ఆటవస్తువులు, వీలైతే నిద్రపోయే స్థలం అందుబాటులో ఉంచాలి. ప్రీప్రైమరీ విభాగానికి రెండు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేశారు. ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు టీచింగ్ అనుభవం ఉన్న వారిని పది నెలల గౌరవ వేతనంతో తాత్కాలిక పద్ధతిన స్థానికులను నియమించనున్నారు.
ఒత్తిడి లేకుండా...
ఐదేళ్లలోపు పిల్లలు చిన్నారులు కావడం వల్ల వారిపై చదువు ఒత్తిడి ఉండకుండా వారి మనో వికాసాభివృద్ధికి ఆటపాటల ద్వారా విద్యపై ఆసక్తి కనబరిచేలా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు చేయనుంది. పాఠశాల విద్య, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఈ ఏడాది నుంచే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ఇప్పటికే అకడమిక్ ఇయర్ (విద్యా సంవత్సరం) ప్రారంభం కావడంతో రానున్న విద్యా సంవత్సరం పూర్తిస్థాయిలో కొనసాగించాలని విద్యాశాఖ భావిస్తోంది.
జ్ఞానంతోపాటు అల్పాహారం, భోజనం కూడా..
కరిక్యులమ్, యాక్టివిటీ ప్లానింగ్ ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికను అనుసరించనున్నారు. ఇది నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషన్ స్టేజ్‌తో అనుసంధానం చేసి ఉంది. ప్రీప్రైమరీ విభాగాల్లోని పిల్లలు అందరికీ మధ్యాహ్నం భోజనం, అదనంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా స్నాక్స్ అందించనున్నారు. సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తూ పిల్లలకు హక్కుల పరిరక్షణ విధానాలను పకడ్బందీగా అమలు చేస్తారు. ప్రీప్రైమరీ విభాగాలను ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు ప్రతీరోజు పర్యవేక్షించాల్సి ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య విభాగాల అధికారులతో ఉమ్మడి తనిఖీ బృందాలు ఏడాదిలో కనీసం రెండుసార్లు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
రెండు విడతలో రాష్ట్రవ్యాప్తంగా 790 బడుల్లో ప్రీప్రైమరీ
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 88 సర్కారు స్కూళ్లలో అమలు
ఆట, పాటల ద్వారా చదువు
58 ప్రీప్రైమరీ బడులు ఏర్పాటు
ప్రభుత్వం రెండో విడతగా మంజూరు చేసిన ప్రీప్రైమరీలో జిల్లాకు 58 పాఠశాలలు మంజూర య్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున రానున్న విద్యా ఏడాది లేదా ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏర్పాట్లు చేపడతాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా
విద్యాధికారి, సంగారెడ్డి

సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ