పెద్ద చెరువుకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

పెద్ద చెరువుకు ముప్పు

Jul 31 2025 9:16 AM | Updated on Jul 31 2025 9:16 AM

పెద్ద చెరువుకు ముప్పు

పెద్ద చెరువుకు ముప్పు

కాల్వలు కబ్జా.. పూడుకుపోయిన అలుగు

విచారణ చేసి

చర్యలు తీసుకుంటాం

పెద్ద చెరువుకు పెద్దగా ప్రమాదం లేదు. బంధం కొమ్ము వైపు కాలువల కబ్జా అంశంపై ఉన్నతాధికారుల సూచనలు అవసరం. గతంలో అప్పటి కలెక్టర్‌ హనుమంతరావు మౌఖిక ఆదేశాలిచ్చారే కానీ లిఖిత పూర్వక ఆదేశాలివ్వలేదు. అక్కడ కొన్ని ఇళ్లను తొలగించాలని సూచించారు. బంధం కొమ్ము చెరువు కింద కాలువలను కబ్జా చేస్తూ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారన్న విషయంపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – జైభీమ్‌,

ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సంగారెడ్డి

గొలుసు కట్టు చెరువులకు తెగిన లింక్‌

2021లోనే కబ్జాల గుర్తింపు.. తొలగని నిర్మాణాలు

ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు

పటాన్‌చెరు: అమీన్‌పూర్‌ పెద్ద చెరువు బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తింపు పొందింది. విదేశీ పక్షులకు ఆలవాలంగా ఉండే ఈ తటాకం కళావిహీనంగా మారింది. చుట్టూ పెద్ద పెద్ద భవంతులు ఏర్పడటంతో డ్రైనేజీ నీరు వచ్చి చెరువులో కలుస్తోంది. అలుగులు పూడుకుపోవడటంతో నిండుకుండలా ఉంది. అయితే శిఖం భూమి కబ్జా కాకుండా, ఎఫ్‌టీఎల్‌ను గుర్తించేందుకు ఇరిగేషన్‌ అధికారులు నీటిని కిందకు వదలడం లేదని తెలుస్తోంది. దీంతో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు, అక్కడ ఏర్పడిన పలు కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కనుమరుగైన కాల్వలు..

గతంలో పెద్ద చెరువు నుంచి బంధం కొమ్ము చెరువు వరకు గొలుసుకట్టు చెరువులుగా, వాటికి అనుసంధానంగా కాలువలు ఉండేవి. కానీ, కొత్తగా వెంచర్లు వెలుస్తుండటంతో కొన్ని చోట్ల కాలువలు కబ్జా అవుతున్నాయి. ఎగువ భాగం నుంచి వరద తీవ్రత పెరిగినప్పుడు చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తే ఆర్‌ఆర్‌ హోమ్స్‌ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద చెరువు ఎగువ భాగంలో రియల్‌ సంస్థలు 30 అంతస్తుల హై రైజ్‌ భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. దీంతో చెరువు నీరు రైతుల పొలాల్లోకి పారుతోంది. స్థానిక రైతులు తమ పొలాల్లో నీరు ఉండకుండా ఎత్తు పెంచేందుకు మట్టిని పోస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా తాము ఈ ప్రాంతంలో ఉన్నామని ఎప్పుడు లేనిది పొలాలు నీట మునుగుతున్నాయని స్థానిక రైతు రామిరెడ్డి వాపోయారు.

పొంచి ఉన్న ప్రమాదం...!

వర్షాలు ఎక్కువగా కురిస్తే అలుగులు లేని చెరువుతో ప్రమాదం పొంచి ఉందని, అదే జరిగితే ఇప్పుడున్న కాలనీలన్ని నీటి మునిగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కబ్జా అయిన కాల్వవలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. బందం కొమ్ము చెరువు శిఖం, కాల్వలు కబ్జా అయ్యాయని.. 2021లో అప్పటి కలెక్టర్‌ హన్మంతరావు నిర్ధారించారు. అలాగే క్షేత్ర స్థాయిలో సైతం పర్యటించి అక్కడ నిర్మాణాలను కూల్చాలని స్థానిక అధికారులకు కూడా సూచించారు. కానీ నేటికీ హైడ్రా వచ్చినా కబ్జాలను తొలగించలేదని సమీప కాలనీల ప్రజలు, రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా కబ్జాకు గురైన కాల్వలను పునరుద్ధరించాలని, చెరువు నిండినప్పుడు నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement