స్వచ్ఛతకు దూరంగా..! | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతకు దూరంగా..!

Jul 31 2025 9:16 AM | Updated on Jul 31 2025 9:16 AM

స్వచ్

స్వచ్ఛతకు దూరంగా..!

పేరుకే సంగారెడ్డి గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీ

గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 94వ ర్యాంకు

కంపు కొడుతున్న డంప్‌యార్డ్‌

ముక్కుపిండి పన్నులు వసూలు..

వసతులు మాత్రం శూన్యం

సంగారెడ్డి: పేరుకే గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీ సంగారెడ్డి.. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులో మాత్రం 94వ స్థానానికి పరిమితమైంది. పట్టణంలో కంపు కొడుతున్న డంపుయార్డ్‌ , వసతుల లేమి, మౌలిక సదుపాయాలు, స్వచ్ఛత విషయంలో వెనకబడటంతో వెరసి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంతటికి కారణం మున్సిపాలిటీలో ప్రైవేటు వ్యక్తుల హవాతో అధికారులు ఎలాంటి అభివృద్ధి, వంద రోజుల ప్రణాళిక పనులు సైతం చేయలేకపోతున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

పారిశుద్ధ్యంపై పర్యవేక్షణేది?

పారిశుద్ధ్యం మెరుగు పరచడంతో పాటు మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. జూన్‌ 2వ తేదీ నుంచి సెప్టెంబరు 10 వరకు క్షేత్రస్థాయిలో రోజుకో కార్యక్రమం నిర్దేశించారు. కానీ సంగారెడ్డిలో స్వచ్ఛ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎక్కడ ఏం పని జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అధికారులు ఉన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇకనైనా ప్రణాళిక పనులు పటిష్టంగా అమలు చేసేలా జిల్లా కలెక్టర్‌, మున్సిపాలిటీ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అమలు కానీ ప్రణాళిక..!

ప్రతి మార్పు అభివృద్ధికి బాటలు అనే నినాదంతో.. 50 అంశాల్లో రోజుకో కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. కానీ పట్టణంలో మాత్రం జరగడం లేదు. సామాజిక, స్వచ్ఛంద మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తూ, పారిశుద్ధ్యం, పచ్చదనం తదితర కార్యక్రమాలు నిర్వహించి, శిథిల భవనాలను గుర్తించి వాటిని తొలగించాలి.

ప్రైవేట్‌ వ్యక్తుల హవా

పట్టణ అభివృద్ధిలో వార్డు అధికారులదే కీలక పాత్ర. అందుకు ప్రతి వార్డుకు ఓ అధికారిని నియమించారు. వీరు ఆశించిన స్థాయిలో పనులు చేయడం లేదు. చాలా వరకు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వార్డు అధికారుల విధులకు సంబంధించి ఉత్తర్వులను ఇటీవలే పురపాలక శాఖ విడుదల చేసింది. కానీ వారి చేతిలో ఏమి లేని అయోమయ స్థితిలో ఉన్నారు. కాలనీల్లో ఏ పని జరగాలన్న ప్రైవేట్‌ వ్యక్తుల హవాతో అధికారులకు తెలియకుండానే జరిగిపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

గతేడాది సర్వేలోనూ లాస్ట్‌..

దేశవ్యాప్తంగా జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024 పట్టణాల సర్వే ఫలితాలను రాష్ట్రపతి జూలై 17న విడుదల చేశారు. ఇందులో రాష్ట్రాల వారీగా మున్సిపాలిటీల ర్యాంకులను ప్రకటించారు. అయితే సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్‌ మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఉండగా సంగారెడ్డి, అందోల్‌ జోగిపేట్‌ మున్సిపాలిటీలు చివరి స్థానంలో ఉన్నాయి. తెల్లాపూర్‌ –18, అమీన్‌పూర్‌ – 31, సదాశివపేట్‌ – 52, జహీరాబాద్‌ –54 , బొల్లారం నారాయణఖేడ్‌ –89 , సంగారెడ్డి – 94, అందోల్‌ జోగిపేట్‌ –118వ స్థానంలో నిలిచాయి.

నంబర్‌వన్‌కు ప్రయత్నిస్తా..

స్వచ్ఛత విషయంలో సంగారెడ్డి మున్సిపాలిటీని నంబర్‌ వన్‌గా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజు పనులను పరీక్షించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి.

– శ్రీనివాస్‌ రెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌, సంగారెడ్డి

స్వచ్ఛతకు దూరంగా..!1
1/1

స్వచ్ఛతకు దూరంగా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement