
ఇసుక పరేషాన్ లేదిక!
● జిల్లాలో మూడు
ఇసుక స్టాక్ పాయింట్లు
● మండలానికి ఒకటి ఏర్పాటు !
● తక్కువ ధర, నాణ్యమైన ఇసుక
అందించడమే లక్ష్యం
జోగిపేట(అందోల్): ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ప్రతీ మండలంలో ఇసుక నిల్వలు (స్టాక్ పాయింట్)లను ఏర్పాటు చేస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా మూడు మండలాలను గుర్తించింది. ఇటీవల అందోల్, కోహీర్, నిజాంపేట మండలాల్లో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి నిల్వ ఉంచుతున్నారు. డిజిటల్ మానిటరింగ్ ద్వారా ఈ కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు సమాచారం. వర్షాకాలం మినహా అన్ని కాలాల్లో స్టాక్ పాయింట్లను ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోతే ప్రజలు మళ్లీ మార్కెట్‌వైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. వీటితోపాటు రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వారి ద్వారానే డబ్బులను వసూలు చేసినా ఇబ్బందులుండవని భావిస్తున్నారు. ఇసుక పంపిణీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేస్తే ఈ కార్యక్రమం విజయవంతం అయి ప్రభుత్వ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ప్రభుత్వమే ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లయితే ఇసుక అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతోపాటు అక్రమ మాఫియాల నియంత్రణ జరుగుతుంది. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ, నియంత్రిత తవ్వకాలు, ఆథరైజ్డ్ మైనింగ్ వల్ల పర్యావరణ విధ్వంసం తగ్గే అవకాశం ఉంది. పాలసీ అనుసరణ, టెండర్లు, డిజిటల్ మానిటరింగ్ ఉంటే కేంద్రాలు విజయవంతం అవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్టాక్ పాయింట్‌లతో ప్రజలకు ప్రయోజనం
స్టాక్ పాయింట్‌లతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందిరమ్మ ఇళ్లకే కాకుండా ప్రతీ ఒక్కరు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ పాయింట్‌లో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇసుక లభిస్తుంది. ప్రజలు టోకెన్ తీసుకుని తమ అవసరానికనుగుణంగా బుకింగ్ చేసుకోగలుగుతారు. అక్రమ మాఫియాల నుంచి రక్షణ ప్రజలు మోసపోవడం తగ్గుతుంది.
త్వరలోనే ధర నిర్ణయం
జిల్లాలోని కోహీర్, అందోలు, నిజాంపేట మండలాల్లో మొదటగా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే ఇసుక ధరపై టీజీఎండీసీ నిర్ణయం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. మైనింగ్ శాఖ కూడా స్టాక్ పాయింట్లపై మానిటరింగ్ చేస్తుంది.
– చలపతిరావు, హౌసింగ్ పీడీ, సంగారెడ్డి