
ముందు చూపే సాగుకు మందు
దుబ్బాకటౌన్: మరి కొన్ని రోజుల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే రైతులు ప్రణాళికబద్ధంగా సాగుకు సిద్ధమైతే మంచి దిగుబడులు సాధించవ్చని ఏరువాక వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ రైతులకు సూచిస్తున్నారు. తొలకరి చినుకులు పడే వరకు వేచి చూసి పనులు ప్రారంభించడం కంటే నెల రోజుల ముందు నుంచే సాగుకు సన్నద్ధమైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పంట సాగుకు ముందు నుంచే ఖర్చులను లెక్కించుకోవాలి. పెట్టుబడులకు అనుగుణంగా విత్తనాలను, కూలీలు, ఎరువులు కొనుగోలుకు వ్యయాన్ని సమకూర్చుకోవాలి.
వేసవి దుక్కులు కీలకం..
వానాకాలం సాగుకు నెల రోజుల ముందు నుంచే పంట చేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తు కోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంట కోతల అనంతరం భూమిని వృథాగా వది లేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ పురుగులను నివారించొచ్చు. అంతే కాకుండా వర్షాలు కురిస్తే నీరు భూమి లోపలి వరకు చేరుతుంది. మొదటిసారి దుక్కులు దున్నిన తర్వాత రెండోసారి దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు లేదా చెరువు మట్టిని పొలంలో వెదజల్లడం వల్ల మంచి దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది.
పత్తి మొదళ్లను భూమిలో కలపడం
ఏటా పత్తి దిగుబడి అనంతరం రైతులు పత్తి మొదళ్లను కోసి తగల బెడుతుంటారు. పత్తి మొదళ్లు వృథాగా పోకుండా భూమిలో తేమ ఉన్నప్పుడు రోటవేటరుతో కలియ దున్నాలి. ఇలా చేయడం వల్ల భూమి సారవంతం పెరగడమే కాకుండా రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు.
భూసార పరీక్షలు
భూమిలో సారం ఎంత వరకు ఉంది. ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి, ఎంత మోతాదు ఎరువులు వాడాలి అనే విషయం గ్రహించేందుకు భూసార పరీక్షలు కీలకం కానున్నాయి. అధిక దిగుబడికి పోటీ పడి నష్టాలు కొని తెచ్చుకోవడం కంటే భూసార విలువలు తెలుసుకొని కాలానుగుణంగా సాగుతీరు మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించొచ్చు. ఇసుక నేలు, ఒండ్రు నేలలు, రేగడి నేలలు, బంకమట్టి నేలలు, నీరు నిలిచే నేలలు, తదితర నేలలకు అనుగుణంగా పంట విత్తుకోవడంతో ఆశించిన దిగుబడి పొందవచ్చు. రైతులు మూడు పంటలకొకసారి భూసార పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
సేంద్రియ ఎరువులు
సేంద్రియ ఎరువులు నేలలో కుళ్లి ఖనిజ పొరల్లో అభివృద్ధి చెంది పంటకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను పంటలకు అందిస్థాయి. నేల రసాయనిక, భౌతిక, జీవ గుణాలపై ప్రభావం చూపి నేల సత్తువ, ఉత్పాదక శక్తిని పెంచుతాయి. పశువుల ఎరువులు, కోళ్లు, గొర్రెలు, వానపాముల ఎరువును ఎకరానికి సుమారు 2 నుంచి 4 టన్నుల వరకు వాడవచ్చు. విత్తడానికి 20 నుంచి 25 రోజుల ముందే సేంద్రియ ఎరువులు వేసి భూమిలో కలియ దున్నాలి. సేంద్రియ పదార్థం వాడటం వల్ల భూమి గట్టి పడకుండా గుల్లగా ఉంటుంది. నీరు బాగా ఇంకటం వల్ల తేమ గణనీయంగా పెరిగి విత్తనం బాగా మెలకెత్తుతుంది.
వేసవి దుక్కులతో రైతులకు ఎంతో మేలు
విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు
అధిక ఎరువులతో అనర్థాలు
వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త విజయ్
నాణ్యమైన విత్తనాలు
పంట సాగులో విత్తనాల ఎంపిక ప్రధానం. దాదాపు 38 సంస్థలు వందల రకాల విత్తనాలను మార్కెట్‌లో సిద్ధంగా ఉంచుతున్నాయి. ఆయా కంపెనీల డీలర్లు రైతులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏ కంపెనీ నాణ్యమైన విత్తనాలను అందిస్తుందనే విషయంలో రైతులకు అవగాహన లేకుండా పోతుంది. ఏటా ఏదో ఒక కంపెనీ విత్తలనాను వేసుకునే కంటే నాణ్యమైన విత్తలనాలకు రైతులే విత్తనోత్పత్తికి తోడ్పడితే మేలు.

ముందు చూపే సాగుకు మందు