వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

May 21 2025 8:41 AM | Updated on May 21 2025 8:41 AM

వేర్వ

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

హుస్నాబాద్‌లో ఎదురెదురుగా

ఢీకొన్న ఆటో, కారు

హుస్నాబాద్‌రూరల్‌: ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హుస్నాబాద్‌ మండలం జిల్లెలగడ్డలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బానోతు రాజు, లలిత కుటుంబం కరీంనగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇద్దరు కుమారులు ఆటో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు అశోక్‌(20) గట్లనర్సింగాపూర్‌ గ్రామానికి నాయనమ్మను చూసేందుకు వచ్చి తిరిగి కరీంనగర్‌ వెళ్తున్నాడు. మార్గమధ్యలో జిల్లెలగడ్డ దగ్గరకు రాగానే హుస్నాబాద్‌ నుంచి హన్మకొండకు వెళ్తున్న కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యి డ్రైవర్‌ అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మహేశ్‌ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం పంచనామ చేస్తున్న పోలీసులను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని తీసుకొచ్చి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ హుస్నాబాద్‌ ప్రభుత్వాస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు. కారు యజమానికి పోలీసులు ఫోన్‌ చేయగా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నట్లు చెప్పారు. వాళ్లు వచ్చే వరకు పోస్టుమార్టం చేసేది లేదని భీష్మించి కూర్చోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రిలోనే భద్రపరిచారు.

కారు ఢీకొని వాచ్‌మెన్‌

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అలిరాజ్‌పేట సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అలిరాజ్‌పేట గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింలు(65) పీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం నిర్మల్‌నగర్‌ ఎల్లమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఉండటంతో వెళ్లాడు. అన్నం తిని సైకిల్‌పై తిరిగి గార్డెన్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై నర్సింలు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

టీవీఎస్‌ ఎక్సెల్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

వట్‌పల్లి(అందోల్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం అందోల్‌ మండల పరిధిలోని అన్నాసాగర్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్‌ఐ పాండు కథనం మేరకు.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన దానంపల్లి రాములు (52) టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై జోగిపేట వైపు వస్తున్నాడు. అన్నాసాగర్‌ శివారులో ఎదురుగా వచ్చిన సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్‌ జె.లింగయ్య అజాగ్రత్తగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య తుల్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి1
1/1

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement