
జూన్ 2 నుంచి చెక్కుల పంపిణీ..
రాజీవ్ యువ వికాసంలో భాగంగా సిబిల్ స్కోర్‌ను ప్రమాణికంగా తీసుకుంటే బ్యాంకు లావాదేవీలు జరిపే వారికే పథకం వస్తుందని, ఇందులో పేద నిరుద్యోగులైన అర్హులకంటే అనర్హులకే లబ్ది చేకూరే అవకాశాలు ఉంటాయని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్, ట్రాక్ రికార్డు, రికవరీ లాంటి అంశాలు ఏవీ పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, బీసీ, ఐటీడీఏ తదితర సంస్థల రుణాలు పొందిన వారు ఉన్నారని, రాజీవ్ యువ వికాసంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని నిరుద్యోగ యువతకు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. దీంతో జిల్లాలోని నిరుద్యోగుల్లో సంతోషం నెలకొంది.
భారీగా ధరఖాస్తులు..
జిల్లాలో ఊహించని విధంగా భారీ స్థాయిలో యువత నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకంలో రూ.50 వేలు మొదలు కొని రూ.4 లక్షల వరకు రుణం పొందేందుకు నిర్ణయించారు. గత నెల 14వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించగా 51,657 మంది దరఖాస్తులను సమర్పించారు. అత్యధికంగా బీసీ వర్గాల నుంచి 6,546 యూనిట్లకు గాను 23,681 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ విభాగంలో 7,415 యూనిట్లకు 14,480 దరఖాస్తులు, మైనార్టీ విభాగంలో 2,456 యూనిట్లకు 8,378 దరఖాస్తులు, ఎస్టీ విభాగంలో 2,502 యూ నిట్లకు 4,232 దరఖాస్తులు, ఈబీసీలో 1,654 యూనిట్లకు 817 దరఖాస్తులను సమర్పించారు.
ఈ పథకానికి ఎంపికై న లబ్ధిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి చెక్కులు పంపిణీ చేయనున్నారు. మండల, మున్సిపల్ స్థాయిల్లో అధికారులు గత నెలాఖరు నుంచి దరఖాస్తుల వెరికేషన్ ప్రక్రియను చేపట్టారు. జాబితాను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అధికారులు సిఫారసు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా జాబితాలో ఉన్న వారిని మరింత వడబోసి కలెక్టర్ ఆధ్వర్యంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారుల జిల్లా కమిటీ ఎంపిక చేయనున్నారు. రూ.50 వేల లోపు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కేటగిరీ–1లో చేర్చారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉన్న దరఖాస్తుల దారులను కేటగిరీ–2లో, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ–3గా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ–4లో చేర్చారు. కేటగిరీ 1 కింద వందశాతం రాయితీతో రూ.50 వేల రుణం మంజూరు చేయనున్నారు.