
ఆర్‌వీఎంలో అరుదైన శస్త్ర చికిత్స
ములుగు(గజ్వేల్) : మండలంలోని లక్మక్కపల్లి ఆర్‌వీఎం ఆస్పత్రి వైద్యులు మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రి సీఈఓ శ్రీనివాస్‌రావు కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన తాడూరి యాదగిరి(65) ఇటీవల ఒక శుభకార్యంలో భోజనం చేస్తూ త్రిభుజాకారంలో ఉన్న ఎముకను మింగాడు. ఆ ఎముక గొంతు ద్వారా అన్నవాహిక వద్దకు వెళ్లి నిలిచిపోయింది. దీంతో కడుపునొప్పి, శ్వాసపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. స్పందించిన వైద్యులు శ్రీనివాస్, అభిషేక్, గోపికృష్ణ, వరుణ్, భావన యాదగిరికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎముకను గుర్తించారు. సమస్య పరిష్కారానికి గ్యాస్ట్రోస్కోపీలో నూతన సాంకేతికను వినియోగించి ఓవీఏస్కో చికిత్స ద్వారా వైద్యులు సురక్షితంగా ఎముకను తొలగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.