
ఊళ్లల్లో ఉపాధి జోరు
39.96లక్షల దినాల కల్పన లక్ష్యం
● గతేడాది లక్ష్యాన్ని మించి పనులు ● రోజురోజుకు పెరుగుతున్న కూలీల సంఖ్య ● పెరిగిన కూలితో కూలీలకు గిట్టుబాటు
సంగారెడ్డి జోన్: గ్రామాలలో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలన్నదే ఉపాధి హామీ లక్ష్యం. ఇందులో పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి జాబ్ కార్డులు మంజూరు చేసి 100 రోజుల పని కల్పిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులతోపాటు మరి ఏ ఇతర పనులు లేకపోవడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు జోరుగా సాగుతున్నాయి. పని ప్రదేశాలు కూలీలతో సందడిగా కనిపిస్తున్నాయి.
నిర్దేశించుకున్న లక్ష్యం మేరకే..
ఉపాధి హామీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 39.96 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఈ ఆర్థిక ఏడాదిలో చేపట్టి పనులను గుర్తించేందుకు గతేడాది డిసెంబర్‌లో గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి ఉపాధి పనులను గుర్తించారు. గుర్తించిన పనుల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి వాటిని చేపడుతున్నారు. అవసరమైతే ప్రజలు, రైతుల అవసరం మేరకు మరిన్ని పనులు చేపడుతున్నారు.
లక్ష్యాన్ని మించి పనులు
గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి ఎక్కువగా పనులు చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక ఏడాదిలో 49.56లక్షలు నిర్దేశించగా ఈ ఏడాది 50.02లక్షల పని దినాలు కల్పించారు. సుమారు 50 వేల పని దినాలు అదనంగా కల్పించారు.
పెరుగుతున్న కూలీల సంఖ్య
ఉపాధి హామీలో పనులు ప్రారంభించిన నాటి నుంచి రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలో 24 మండలాల్లో 619 గ్రామపంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమలవుతుంది. జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతీరోజు 40 వేలమందికి పైగా పనులకు హాజరవుతున్నారు.
పెరిగిన కూలీతో...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో పనులు చేస్తున్న కూలీలకు రూ.7లను అదనంగా పెంచింది. దీంతో కూలి రూ.307లకు పెరిగింది. దీంతో కూలీలకు గిట్టుబాటు లభించినట్లయ్యింది. అంతేకాకుండా కూలీలకు గిట్టుబాటు వేతనం అందేవిధంగా పనులు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉపాధి పథకం వివరాలు
గతేడాది పనిదినాల లక్ష్యం 49.56లక్షలు
గతేడాదిలో పూర్తి చేసిన పనిదినాలు 50.02లక్షలు
ఉపాధిహామీ అమలవుతున్న పంచాయతీలు 619
రోజూ హాజరవుతున్న కూలీల సంఖ్య 42,600
అవగాహన కల్పిస్తున్నాం
సొంత గ్రామంలోనే పని కల్పించటం ఉపాధి పథకం యొక్క లక్ష్యం. ప్రతీ ఒక్కరు పనులకు హాజరయ్యేవిధంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ కూలీకి గిట్టుబాటు అయ్యేవిధంగా ప్రణాళికబద్ధంగా పనులు కల్పిస్తున్నాము. ఉపాధి హామీని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.
–జ్యోతి, డీఆర్‌డీఏ, సంగారెడ్డి జిల్లా

ఊళ్లల్లో ఉపాధి జోరు