
ఉల్లి రైతు
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఇన్నాళ్లు వినియోగదారులను కంట తడి పెట్టించిన ఉల్లి.. ఇప్పుడు ఆ పంట పండించిన రైతులను కంటతడి పెట్టిస్తోంది. సీజను ప్రారంభానికి ముందు మంచి ధర పలికిన ఉల్లిగడ్డ ఇప్పుడు ధర పడిపోవడంతో ఈ పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజను ప్రారంభమయ్యే వరకు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ధర పలికింది. పక్షం రోజుల్లో ఈ ధర పూర్తిగా పడిపోయింది. గరిష్టంగా రూ.1,300లకు పడిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పంట చేతికందిన సమయంలో ధర పడిపోవడంతో తామంతా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రధాన ఉల్లి మార్కెట్లలో ఒకటైన సదాశివపేట మార్కెట్‌యార్డులో ఈనెల 11న ఉల్లిగడ్డకు పలికిన ధరను పరిశీలిస్తే.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,369 పలకగా, కనిష్టంగా రూ.529కే పరిమితం కావడం గమనార్హం. గరిష్టంగా రూ.1,369 పలికింది అతి కొద్దిమంది రైతులకే కాగా, సుమారు 85 శాతం రైతులకు క్వింటాల్‌కు రూ.వెయ్యి లోపే కావడం గమనార్హం. జిల్లాలోని ఇతర ప్రధాన మార్కెట్లు పటాన్‌చెరు, జోగిపేట్ మార్కెట్‌లో కూడా దాదాపు ఇవే ధరలు పలికాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడులు కూడా రావంటున్న రైతులు
జిల్లాలో ఉల్లిగడ్డను ఎక్కువగా మనూరు, కొండాపూర్ మండలాల్లో సాగు చేస్తారు. సదాశివపేట, నారాయణఖేడ్ మండలాల్లో కూడా రైతులు ఈ పంట వేసుకుంటారు. జిల్లావ్యాప్తంగా ఈసారి సుమారు 1,250 ఎకరాల్లో ఈ పంట సాగైనట్లు ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఈ ఉల్లిగడ్డకు మంచి ధర లభించింది. క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు పలికింది. దీంతో ఈసారి మరింత ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. తీరా ఇప్పుడు ధర పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉల్లినారు ఖర్చులు, నాట్లేసేందుకు..ఉల్లిగడ్డ తవ్వేందుకు కూలీల ఖర్చులు..పురుగు మందులు.. ఇలా సాగు కోసం వెచ్చించిన ఖర్చులు తడిసిమోపెడయ్యాయని రైతులు వాపోతున్నారు. పంటను విక్రయిస్తే కనీసం ఈ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
న్యూస్‌రీల్
కనిష్టంగా క్వింటాల్ రూ.600లకే పరిమితం
పక్షం రోజుల్లో క్వింటాల్‌కురూ.వెయ్యి తగ్గిన వైనం
లబోదిబోమంటున్న రైతులు
పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదన

ఉల్లి రైతు

ఉల్లి రైతు