
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బస్సు
● ఐదుగురికి తీవ్ర , 10 మందికి స్వల్ప గాయాలు ● రెండు అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలింపు
కొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారు లో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ పట్టణానికి చెందిన జుట్టు చంద్రదీప్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగే అతడి పెళ్లికి కరీంనగర్ నుంచి మూడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కుటుంబీకులు, బంధువులు శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ దుద్దెడ శివారులో టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రక్కన పార్కు చేసి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న 24 మంది నిద్ర మత్తులో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెళ్లి కొడుకు కుటుంబీకులు జుట్టు లక్ష్మి, జుట్టు లక్ష్మినారాయణలతో పాటు బంధువులు రుద్ర, లత, ఓదెమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓదెమ్మ, శ్రీలత, రాజ్‌కుమార్, అన్విత్, రాజవ్వ, మాధవి, జైదేవ్, సహస్రలతో పాటు మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులను రెండు అంబులెన్సులలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మినారాయణ, లత పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బస్సు