కూరగాయల సాగుపై దృష్టి సారించాలి
● జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు
● కుందనవానిపల్లి తోటలు పరిశీలన
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రతీ ఒక్క రైతు కూరగాయల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖ సలహాదారుడు నాగరాజు అన్నారు. అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో ఏలేటి స్వామిరెడ్డి అనే రైతు సాగు చేసిన కూరగాయల తోటను సందర్శించి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. అదే విధంగా మైసమ్మవాగు తండా, గండిపల్లి గ్రామాల్లో సాగు చేసిన కూరగాయల పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్ నెట్ల కింద కూరగాయలు, పూలు, సుగుంధ ద్రవ్యాల మొక్కలు తదితర పండించవచ్చునన్నారు. కర్రలపై షెడ్ నెట్లు పరిచి వాటి కింద మిరప, క్యారెట్ తదితర కూరగాయలు, ఆకు కూరలు పండించవచ్చన్నారు. బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు నీటి ద్వారా పోషకాలు, ఎరువులు అందించవచ్చు అన్నారు. తద్వారా నీటిని పొదుపు చేయడంతోపాటు ఎరువుల వృథా తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత, రైతులు స్వామిరెడ్డి, శ్రీ ను, వెంకటేష్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


