కదిలేదేలే!
● అధికారులపై ఎన్ని ఆరోపణలువచ్చినా చర్యలు శూన్యం ● ఫిర్యాదులు వస్తేనే ముందుకొస్తున్న అవినీతి నిరోధకశాఖ
పటాన్‌చెరు పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్లుగా అధికారుల తిష్ట
రామచంద్రాపురం(పటాన్‌చెరు): సంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలల్లోని పోస్టింగ్‌లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసేందుకు వివిధ శాఖల ప్రభుత్వాధికారులు పోటీలు పడుతున్నారు. అందుకోసం వారికున్న పలుకుబడిని సైతం ఉపయోగిస్తున్నారు. ఎవరికై నా పనులు కావాలంటే ఇక సదరు అధికారుల ఇష్టారాజ్యం నడుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో వారు ఉద్యోగం చేసేది వారి సొంత లాభాల కోసమా లేక ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యమో తెలియడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో పనిచేసే అధికారులపై అనేక అవినీతి ఆరోపణలున్నప్పటికీ అధికారులపై పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి పైరవీలు వారివే..
నియోజకవర్గం పరిధిలోని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీసు వివిధ శాఖలలో పని చేసే అధికారులు ఈ ప్రాంతాలలో పోస్టింగ్‌ల కోసం పోటీ పడుతున్నారు. అందుకోసం హైదరాబాద్‌లోని రాజకీయనాయకులు, ప్రముఖుల సిఫారుసులు తీసుకుని ఇక్కడికి బదిలీపై వస్తున్నారని స్థానికులు వాపో తున్నారు. అందుకు ఎంత ఖర్చు చేసేందుకై నా వెనుకంజ వేయడం లేదని స్థానికులు, రాజకీయ నాయకులు గుసగుసలాడుతున్నారు. మరికొంతమంది ఎన్ని ఆరోపణలున్నా ఇక్కడి నుంచి బదీలీలు కాకుండా పైరవీలు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
ఇక్కడ పని చేస్తే అంతే..
ఈ ప్రాంతంలో ఏ ప్రభుత్వ శాఖను తీసుకున్నా ఒకసారి పని చేశారంటే ఇక ఆ అధికారి ఈ ప్రాంతాన్ని వదిలివెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. మరికొంతమంది అధికారులు ఈప్రాంతంలో పని చేసి ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా తిరిగి ఈ ప్రాంతంలోనే పోస్టింగులు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
సమస్యలు పట్టించుకోని దుస్థితి
స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వివిధ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. వారి సొంత లాభాలు చూసుకోవడం తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక స్థానికులు ప్రధాన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకునిపోతున్నారు.
ఆసక్తి చూపడానికి కారణాలు ఇవేనా
పటాన్‌చెరు నియోజకవర్గం మహానగరానికి అనుకుని ఉండటం వల్లే చాలామంది అధికారులు ఇష్టపడుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందటంతోపాటు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వారి పిల్లల భవిష్యత్తుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్న ఆలోచన పలువురి అధికారులలో ఉన్నది.
ఆరోపణలున్నా చర్యలుశూన్యమే..
ప్రధాన శాఖలలో పని చేసే అధికారులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ వారిపై పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ శాఖలలో పనిచేసే కొంతమంది అధికారులు తమని ఎవరూ ఏమి చేయలేరని బహిరంగ సవాళ్లు కూడా విసురుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తమను బదిలీలు చేయడం అంత ఆషామాషీ కాదనీ తమంతట తాము వెళ్తే తప్ప తమను ఎవరు బదిలీ చేయలేరని ప్రజలకు, రాజకీయ నేతలకు సవాళ్లు విసురుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.


