రైతులకు అండగా కాంగ్రెస్
● రూ.170 కోట్లతో సింగూరుకాలువలకు సీసీ లైనింగ్ ● విద్య,వైద్య హబ్‌గా అందోల్‌నియోజక వర్గం ● మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి/జోగిపేట(అందోల్) : రైతులకు అండగా ఉండేది, వ్యవసాయాన్ని పండగగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట్ డివిజన్‌లో గురువారం జరిగిన ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరై చైర్మన్ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి తో పాటు 23 మంది డైరెక్టర్లను అభినందించారు. అంతకుముందు జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అందోల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగిన శివ పార్వతుల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సింగూరు లిఫ్టు ప్రాజెక్టు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే రూ.170 కోట్లతో సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నట్లు వివరించారు. విద్య వైద్య హబ్‌గా అందోల్ నియోజకవర్గాన్ని తీర్చి దిద్దుతామని తెలిపారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ త్వరలో విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. చౌటకూర్ మండలానికి పీహెచ్, అంబులెన్స్, పోలీసుస్టేషన్, కేజీబీవీ, పాఠశాలను మంజూరు చేస్తానని హామీనిచ్చారు.


