జానపద సాహిత్యంపై జాతీయ సదస్సు
సిద్దిపేట ఎడ్యుకేషన్: జానపద సాహిత్య ఆధ్య పరిశోధకులు ఆచార్య బిరుదు రాజు రామరాజు శత జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో 15, 16 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, సదస్సు కన్వీనర్ తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జానపద సాహిత్యానికి తెలంగాణం కేంద్ర స్థానమని, ఇక్కడ ఉన్నంత జానపద సాహిత్య సంపద దేశంలో మరో ప్రాంతానికి లేదన్నారు. బిరుదురాజు రామరాజు తెలంగాణ జానపదసాహిత్యంపై చేసిన విశ్వవిద్యాలయస్థాయి డాక్టరేటు పరిశోధన దక్షిణ భారతదేశంలోనే మొదటిదన్నారు. అప్పటి నుంచి జానపద సాహిత్య సేకరణ, పరిశోధన నిర్విరామంగా నడుస్తుందన్నారు. ఈ సదస్సుకు రెండు తెలుగురాష్టాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటుగా ఇతర ప్రాంతాలనుంచి పరిశోధకులు పత్రసమర్పణలు చేస్తారన్నారు. ఈ రంగంలో విశేష పరిశోధనలు చేసిన ఆచార్యులు, పరిశోధకులు వక్తలుగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో సదస్సు సమన్వయకర్త పిట్ల దాసు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, తెలుగుశాఖ అధ్యాపకులు సంపత్ కుమార్, నరేశ్, రామస్వామి, శైలజ, సాయి సురేశ్, నర్సింహులు, రమణ, సిబ్బంది, తదిత రులు పాల్గొన్నారు.
15, 16 తేదీల్లో సిద్దిపేట
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహణ


